హైదరాబాద్ కోకాపేటలో చిరంజీవి "సైరా" సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ 30 శాతం పూర్తయిందని సమాచారం. కోకాపేటలో ప్రత్యేకంగా వేసిన సెట్లో "హ్యారీపోటర్" సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ఈ షూటింగ్ జరిగింది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గ్యారీ పావెల్ తనదైన శైలిలో ఈ యాక్షన్ సీన్లను రూపొందించారు. దాదాపు 35 రోజులుగా రాత్రి షెడ్యూల్లో జరిగిన ఈ యాక్షన్ సీన్ల షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.
సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సీన్లను అద్భుతంగా తెరకెక్కించారని వినికిడి. ఈ సినిమాకి యాక్షన్ సీన్లను రూపొందిస్తున్న గ్యారీ పావెల్ గతంలో స్కైఫాల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, హ్యారిపోటర్, కాసినో రాయల్, బ్రేవ్ హార్ట్ లాంటి సినిమాలకు పనిచేశారు. "సైరా" చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్గా నయనతార నటించగా అమితాబ్ బచ్చన్, జగపతిబాబు , సుదీప్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారని కూడా సమాచారం.
కొణిదెల ప్రొడక్షన్స్ బేనరుపై రామ్ చరణ్ "సైరా" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. పరుచూరి బ్రదర్స్ అందించిన కథకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాల్సి ఉన్నా.. ఆ తర్వాత ఆయన డేట్స్ కుదరకపోవడం వల్ల తప్పుకోవడం జరిగింది.