Nomination Filing Rules For Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలవ్వగా.. నేటి నుంచి నామినేషన్ల పర్వం ఆరంభంకానుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ప్రకటించి.. ప్రచార కదన రంగంలో దూసుకుపోతున్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. అభ్యర్థులు శుక్రవారం నుంచి నామినేషన్లు వేయవచ్చు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం ఉంటుంది. బీఫామ్ దక్కించుకున్న అభ్యర్థులు, స్వతంత్రులు, టికెట్ ఆశించిన భంగపడిన నేతలు నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. కొందరు నేతలు తమ పేరు బలాల మీద మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నేడు, 4, 7, 8, 9, 10వ తేదీల్లో నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో దాఖలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 100 స్థానాలు, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. 119 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్ జారీ చేసిన రూల్స్ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. నామినేషన్ దాఖలు నుంచి ప్రచారం వరకు అభ్యర్థులు పాటించాల్సిన నియమావళిని విడుదల చేసింది. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.
==> నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీకి చెందిన వారు అయితే.. ఆ అభ్యర్థిని అదే నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. గుర్తింపు పొందని పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులను అదే నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి.
==> పోటీ చేస్తున్న అభ్యర్థి తాను ఓటు హకు ఉన్న నియోజకవర్గం నుంచి కాకుండా.. మరో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
==> ఒకో అభ్యర్థి ఒకో అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వేయవచ్చు.
==> ఎన్నిలక ప్రచారానికి సంబంధించి ప్రతి పైసా అభ్యర్థి అకౌంట్ నుంచే ఖర్చు చేయాలి. జాయింట్ అకౌంట్‌కు అనుమతి లేదు. అభ్యర్థి పేరు మీద మాత్రమే అకౌంట్ ఉండాలి.
==> ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కచ్చితంగా అదే నియోజకవర్గానికి చెందిన వారై ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ సమర్పించాలి.
==> ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు రూ.10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఎస్సీ, ఎస్టీలైతే రూ.5 వేలు చెల్లించాలి.
==> నామినేషన్ చేసేటప్పుడు నోటరీ చేసిన అఫిడవిట్ అందజేయాలి. అభ్యర్థి ఆస్తులు, అప్పులు, కేసులు వంటి అన్ని వివరాలు కచ్చితంగా పేర్కొనాలి.
==> నామినేషన్ సమయానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అడిగే ఏ ధ్రువపత్రాన్ని అయినా వెంటనే సమర్పించలేకపోతే.. తుది గడువులోపు అందించాల్సి ఉంటుంది.
==> నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఊరేగింపులు ఆపేయాలి.
==> కార్యాలయంలోకి వెళ్లేందుకు అభ్యర్థి వెంట ఐదుగురికి అనుమతి ఉంటుంది.
==> నామినేషన్ పరిశీలన సమయంలో అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, అభ్యర్థిని ప్రతిపాదించిన వ్యక్తుల్లో ఒకరు, మరొక వ్యక్తి ఎవరైనా వెళ్లొచ్చు. లాయర్‌ను కూడా తీసుకెళ్లవచ్చు.
==> నామినేషన్లను పరిశీలించే.. పోటీ చేసే అర్హత నిర్ణయించే అధికారం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది.
==> ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనల మేరకు ప్రతిపాదించే వ్యక్తులు లేకపోతే వారి నామినేషన్ రిజెక్ట్ అవుతుంది. అభ్యర్థిని ప్రతిపాదించే వ్యక్తులకు ఆ నియోజకవర్గంలో ఓటు హక్కు లేకపోయినా.. వారి ప్రతిపాదన చెల్లనిదిగా పరిగణిస్తారు.
ముఖ్యమైన తేదీలు
==> నేడు తెలంగాణ శాసన సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
==> నేడు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ
==> ఈ నెల పదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
==> ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన
==> ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు
==> ఈ నెల 30న పోలింగ్
==> డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు
Also Read: IND Vs SL Highlights: శ్రీలంకకు టీమిండియా అదిరిపోయే పంచ్.. సెమీస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook