AP Assembly Elections 2024: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఫ్యాన్ గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ముద్రగడ.. వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు కుమారుడు గిరిబాబు, కొద్దిమంది అనుచరులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. YSRCPలో చేరడం చాలా సంతోషంగా ఉందని ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా ముద్రగడ ఏ పార్టీలో చేరతారని జోరుగా చర్చ జరిగింది. జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైందని ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే పొత్తుల్లో పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకోవడంతో ముద్రగడ జనసేనలో చేరే ఆలోచనను విరమించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని వైసీపీలో చేరారు.
1978లో జనతా పార్టీలో చేరి పొలిటికల్ కెరీర్ ఆరంభించారు ముద్రగడ. టీడీపీ స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందారు. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ముద్రగడ మంత్రిగా పనిచేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు ఓటర్లను ఆకర్షించేందుకు ముద్రగడ సేవలను సీఎం జగన్ వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురం నుంచి పోటీ..?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించడంతో.. ఆ స్థానంపై వైసీపీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనుంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేసిన పవన్.. ఓటమి పాలయ్యారు. ఈసారి పిఠాపురం నుంచ బరిలో ఉంటున్నారు. పిఠాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా వంగా గీతను ఇప్పటికే నియమించారు. అయితే పవన్ కళ్యాణ్ బరిలో ఉండడంతో అభ్యర్థిని మారుస్తారా..? అనే చర్చ జరుగుతోంది. ముద్రగడ పార్టీలో చేరడంతో ఆయన కుటుంబం నుంచి ఒకరు పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. ఎలాగైనా పవన్ ఓడించేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ముద్రగడ కుటుంబానికి పిఠాపురం టికెట్ ఇస్తే.. వంగా గీతకు మరో అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter