సినిమా పేరు: 2.ఓ
నటీనటులు: రజనీకాంత్, అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్, సుదాంశు పాండే, అదిల్ హుస్సేన్, కళాభవన్ షాంజాన్, రియాజ్‌ఖాన్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్, ఆర్ట్: టి.ముత్తురాజు, ఎడిటింగ్: ఆంథోని
సినిమాటోగ్రఫీ: నీరవ్ షా, VFX సాంకేతిక సహకారం: శ్రీనివాస మోహన్, ఫైట్స్: సెల్వ
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్
సంస్థ: లైకా ప్రొడక్షన్స్ , రిలీజ్ డేట్: 29-11-2018
కథ: నాలుగేళ్ళ కష్టంతో.. దాదాపు రూ.500 కోట్ల రూపాయల పెట్టుబడితో సాంకేతిక అద్భుతాలను సెల్యులాయిడ్ పై ఆవిష్కరించడం కోసం దర్శకుడు శంకర్ తలపెట్టిన సినిమా "2.ఓ". రజనీ అభిమానులే కాదు.. యావత్ భారతదేశంలోని సినీ ప్రేక్షకులందరూ ఈ చిత్రం కోసం కళ్లు కాయలు కాయేలా చూశారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మరోసారి మళ్లీ బయోవార్ సబ్జెక్టునే దర్శకుడు ఎంచుకోవడం జరిగింది. భూమ్యాకర్షణ శక్తిని మించిన శక్తి ఒకటి వచ్చి... భూమి మీద ఉన్న సెల్ ఫోన్లు అన్నింటిని కూడా లాకెళ్లిపోతే ఎలా ఉంటుందనేది చిత్రంలోని ప్రధానమైన పాయింట్.
ఆ సెల్ ఫోన్లన్నీ కూడా ఓ పక్షిరూపంలో ఉన్న మోన్స్టర్ (అక్షయ్ కుమార్) తస్కరించి భూమిపై యుద్ధం ప్రకటిస్తాడు. ఆ బలమైన మోన్స్టర్ను అంతమొందించడం కోసం ప్రముఖ సైంటిస్టు వశీకరణ్ (రజనీకాంత్) రంగంలోకి దిగుతాడు. తను కనిపెట్టిన రోబోట్ చిట్టి సహాయంతో మోన్స్టర్ను అంతమొందించడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సక్సెస్ సాధించాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సెల్ ఫోన్ శబ్ద తరంగాల వల్ల పర్యావరణం ఏ మేరకు నష్టపోతుందో ఒక ఫిక్షన్ కథ ద్వారా దర్శకుడు చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే జనాలను కథకు బాగా కనెక్ట్ చేసేందుకు గ్రాఫిక్ మాయాజాలాన్ని కూడా చూపిస్తారు. ప్రధానంగా రజనీకాంత్, అక్షయ్ కుమార్ మధ్య నడిచే కొన్ని సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. కానీ అదే ఫీల్ సినిమా మొత్తం కలగదు. కానీ విజువల్ వండర్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. రజనీకాంత్ కూడా తన మార్కు స్టైల్‌ను సినిమా మొత్తం కొనసాగించారు. ఇలాంటి సినిమాలు హాలీవుడ్లో చాలా వచ్చినా.. శంకర్ వాటి ప్రభావం ఈ చిత్రం మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. తనదైన క్రియేటివిటీతో కథను నడిపించాడు. ఇక హీరోయిన్ అమీ జాక్సన్ పాత్ర కూడా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఏ.ఆర్.రెహమాన్ తన మార్కు సంగీతాన్నే అందించాడు.
బాటమ్ లైన్: రోబో అంత కాకపోయినా.. ఈ 2.ఓ కూడా రజనీ అభిమానులకు పసందైన విందే.
రేటింగ్: 3/5