హైదరాబాద్: తెలంగాలో 57 ఏళ్లు నిండినవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు వినిపించారు. శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ అందించనున్నట్లు కేసీఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించడంతోపాటు, అర్హులైన వారిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని ఆదేశించారు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హులైన అభ్యర్థుల సంఖ్య నిగ్గుతేలిన అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఈ పథకం కోసం అవసరమైన మొత్తంలో నిధులు కేటాయించి, ఏప్రిల్ నెల నుంచే లబ్ధిదారులకు పెన్షన్లు అందివ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
పంచాయతీరాజ్ అంశాలతోపాటు, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలపై నేడు ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించే క్రమంలో కేసీఆర్ ఈ ఆదేశాలు జారీచేశారని తెలుస్తోంది.