హైదరాబాద్: పారామిలిటరీ బలగాలకు సంబందించిన ఆఫీసర్ల నియామకం కోసం యుపిఎస్సి పరీక్ష విధానాన్ని మార్చడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్లను ఎంపిక చేసే సివిల్ సర్వీసెస్ పరీక్షలో విలీనం చేయాలని అధికారులు తెలిపారు. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ఆర్గనైజ్డ్ గ్రూప్ ఎ సర్వీస్ వర్గీకరణను గత ఏడాది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నేపథ్యంలో ఈ విషయంలో ఒక ప్రతిపాదనను పరిశీలిస్తున్నారని యూపీఎస్సి వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరమే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్ బీ తదితర పారా మిలటరీ బలగాలకు గ్రూప్-ఎ సర్వీస్ హోదా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అన్ని పారా మిలటరీ బలగాలకు ఒకే రిక్రూట్ మెంట్, ఒకే తరహా సిలబస్ ఉండాలని నిర్ణయించారు. ఇప్పటికే యూపీఎస్సీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లకు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షను వీటికి కూడా కలిపి చేపట్టాలని ప్రతిపాదించారు. ఇది త్వరలోనే అమల్లోకి రానుందని అధికారులు చెబుతున్నారు. ఈ కామన్ పరీక్ష వల్ల సివిల్స్ కోసం ప్రిపేరయ్యేవాళ్లు పారా మిలటరీలో, పారా మిలటరీకి ప్రిపేరయ్యే వాళ్లు సివిల్స్ లో చాన్స్ పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.