భారత వైమానిక దళంలో కీలక ప్రయోగం విజయవంతమైంది. ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణి.. తొలిసారి సుఖోయ్ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. దీంతో భూ, సముద్ర తలాల నుంచే కాదు.. ఆకాశం నుంచి కూడా క్షిపణిని ప్రయోగించవచ్చు అని నిరూపించారు. సుఖోయ్ విమానం నుంచి దూసుకెళ్లిన క్షిపణి బ్రహ్మోస్ బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించింది. ఈ క్షిపణితో 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితంగా గురిపెట్టవచ్చు. క్షిపణి బరువు 2.5 టన్నులు. ఇదే ఇప్పటివరకు సుఖోయ్ నుంచి ప్రయోగించిన క్షిపణుల్లో బరువైనది.
ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమై.. చరిత్ర సృష్టించింది అని భారత రక్షణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొనింది. బ్రహ్మోస్ క్షిపణి బృందానికి, డిఆర్డివో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాల చీఫ్ లు అభినందనలు తెలిపారు.