కేంద్రంతోపాటు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టీడీపీకి చెందిన నేత ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అతడిపై ఏపీకి చెందిన బీజేపీ నేతలు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు కారణమైంది. ఏపీకి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఏర్పాటు చేసిన హోర్డింగులపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విజయవాడలో ప్రత్యక్షమైన ఈ ఫ్లెక్సీల్లో కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించిన తీరుని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. మిత్ర పక్షంలో వుంటున్న టీడీపీకి చెందిన నేత ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు పార్టీ పరమైనవి అనుకోవాలా లేక అది అతడి వ్యక్తిగత అభిప్రాయామా అనే విషయాన్ని స్పష్టంచేయాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
కాట్రగడ్డ బాబు వ్యవహార శైలిపై బీజేఎల్పీ హాలులో బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నేతల తీరుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టంచేశారు. ఈ వివాదంపై స్పందించిన మంత్రి మాణిక్యాల రావు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా పొడిగించలేదు. ఒకవేళ అలా పొడిగించినట్టు ఆధారాలుంటే చూపాలి" అని అన్నారు.
ప్రస్తుతం నిర్మాణంలో వున్న ప్రాజెక్టులకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఏపీకీ జీఎస్టీ మినహాయింపు ఇచ్చే ఆలోచనలోనూ కేంద్రం ఉంది. అయినా కూడా ఏపీ కోసం బీజేపీ ఏమీ చేయలేదన్న చందంగా ఏపీ టీడీపీ నేతలు మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు" అని బీజేపీ నేతలు ముక్తకంఠంతో ఖండించారు.
ఫ్లెక్సీ వివాదం: టీడీపీ నేతపై బీజేపీ ఆగ్రహం