న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ఐపీఎల్‌లోకి అడుగుపెడుతోన్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు శకునం బాగాలేదేమో..! ఇప్పటికే బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించడంతో ఐపీఎల్ లో స్మిత్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా అజింక్యా రహానెను యాజమాన్యం నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ ఆలస్యంగా జట్టులో చేరనున్నాడట. తన పాస్‌పోర్ట్ పోవడమే దీనికి కారణమట. మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది.
ఈమేరకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఒక ప్రకటన విడదుల చేసింది. పోగొట్టుకున్న పాస్ పోర్టు స్థానంలో షార్ట్ కొత్తదానికి దరఖాస్తు చేశాడు. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్, వారాంతపు సెలవులు రావడంతో అతడి పాస్‌పోర్టు పని కాస్త ఆలస్యమైంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. కొత్త పాస్‌పోర్టును అధికారులు రోడ్డు మార్గంలో పంపిస్తున్నారంట. దీంతో అతను భారత్‌కు వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు డార్సీ షార్ట్‌ను రూ.4 కోట్లకు దక్కించుకుంది. కాగా.. ఐపీఎల్ 11వ సీజన్ ఏప్రిల్ 7న ప్రారంభం కానుంది. రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఏప్రిల్ 9వ తేదీన తలపడనుంది.
స్మిత్ స్థానంలో హెన్రిచ్ క్లాసెన్
ఐపీఎల్‌కు దూరమైన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానంలో మరో ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ నియమించుకుంది. స్మిత్ స్థానంలో సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను రాజస్థాన్ ఎంపిక చేసుకుందని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడు నెలల క్రితం సొంతగడ్డపై భారత్‌తో సిరీస్‌లో క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.