కృష్ణ జింకలను వెంటాడిన కేసులో 20 ఏళ్లపాటు విచారణ చేపట్టిన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కోర్టు ఆ కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సల్మాన్ ఖాన్‌కి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు అనంతరం రాజస్థాన్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య సల్మాన్ ఖాన్ని జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. జోధ్‌పూర్ సెంట్రల్ జైలులోని 2వ బ్యారక్‌లో సల్మాన్ ఖాన్ ఖైదీగా వుండనున్నాడు. అయితే, ఈ శిక్ష అమలు కోసం సెంట్రల్ జైలుకి వెళ్లిన సల్మాన్ ఖాన్ అక్కడ రిలాక్సింగ్ గా కూర్చున్న ఫోజు ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధనవంతులు, స్టార్ స్టేటస్ అనుభవించే సెలబ్రిటీలకు జైల్లో రాచమర్యాదలు లభిస్తాయని, సాధారణ ఖైదీలకు ఇవ్వని మర్యాదలు జైలుకి వచ్చే ప్రముఖులు, సెలబ్రిటీలకు ఇస్తుంటారనేది జైలు అధికారుల మీద తరచుగా వినిపించే ఆరోపణలు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే జోధ్ పూర్ సెంట్రల్ జైలుకి వెళ్లిన సల్మాన్ ఖాన్ ఇలా జైలులో అధికారులతోపాటు తాపీగా కూర్చుని వున్న ఫోజు సోషల్ మీడియాకు చిక్కడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.
వాస్తవానికి చట్టం ముందు అందరూ సమానమేననేది చట్టం చెప్పే మాట. కానీ వాస్తవంలో అలా జరగడం లేదనేది సోషల్ మీడియా చర్చల్లో పాల్గొంటున్న నెటిజెన్స్ అభిప్రాయం.