India Vs Bangladesh Prediction: బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ అయింది. తొలి వన్డేలో దాదాపు గెలుపు ఖాయమని అనుకున్న దశలో చివరి వికెట్ తీయడంతో విఫలం కావడంతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌కు జట్టులోని లోపాలను అన్ని సరిదిద్దుకుని బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తోంది. తుది జట్టులో కూడా మార్పులు చేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్ చేస్తున్నాడు.
ఈ వన్డేలో భారత్ ఓడిపోతే మూడు వన్డేల సిరీస్ బంగ్లాదేశ్ వశమవుతుంది. 2015లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. అప్పుడు మొదటి రెండు వన్డేలు ఓడిపోయిన భారత్.. చివరి మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు రెండో వన్డేలో గెలిచి హిస్టరీని రిపీట్ చేయాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. ఎలాగైనా బంగ్లాను ఓడించి సిరీస్‌ను సమం చేయాలని భారత్ చూస్తోంది.
ఈనేపథ్యంలోనే టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. షాబాజ్ అహ్మద్ మొదటి మ్యాచ్‌లో విఫలమవ్వడంతో అతని స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అరంగేట్ర మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్న కుల్దీప్ సేన్‌కు మరో అవకాశం ఇస్తారా..? లేదా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌ను టీమ్‌లో తీసుకువస్తారానేది కూడా చూడాలి.
మరోవైపు తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టుతోనే బంగ్లాదేశ్ ఆడే అవకాశం ఉంది. ఆ జట్టు బౌలింగ్‌లో బలంగా కనిపిస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం సమస్యలు ఉన్నాయి. ఆల్‌రౌండర్లు షకిబ్, మెహదీ హసన్‌లు అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని చూస్తున్నారు.
బుధవారం ఉదయం 11:30 గంటలకు రెండు జట్ల మధ్య మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్, సోనీలివ్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్/అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్/ఉమ్రాన్ మాలిక్
బంగ్లాదేశ్: నజ్ముల్ హుస్సేన్, అఫీఫ్ హొస్సేన్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మెహిదీ హసన్ మిరాజ్, లిటన్ దాస్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, అనముల్ హక్ బిజోయ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, ఎబాడోత్ హొస్సేన్.
Ind Vs Ban Updates: ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ రెడీ.. బంగ్లా హిస్టరీ రిపీట్ చేస్తుందా..?