మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 (IPL 2020) కరోనా కారణంగా వాయిదా పడింది. చివరికి ఆరు నెలల తర్వాత సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా టీ20 మెగా టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఆటగాళ్లు ఈ వారం నుంచే యూఏఈకి బయలుదేరాల్సి ఉంటుంది. అయితే కొందరు క్రికెటర్లకు ఇది ఆఖరి ఐపీఎల్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ మునుపటిలా మెరుపులు మెరిపించడం లేదు. వయసు 41 ఏళ్లు, ఫిట్నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. పలు ఫ్రాంచైజీలకు ఆడిన గేల్ ఇప్పటివరకు 125 ఐపీఎల్ మ్యాచ్‌లలో భాగస్వామి అయ్యాడు.
ప్రస్తుతం హర్భజన్ సింగ్ వయసు 40 ఏళ్లు. ఈ వయసులో ఫిట్నెస్ నిలుపుకోవడం చాలా కష్టం. పదేళ్లపాటు ముంబై ఇండియన్స్‌కు ఆడిన తర్వాత భజ్జీ సేవల్ని ముంబై వద్దనుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో 160 మ్యాచ్‌లు ఆడిన అనుభవం భజ్జీ సొంతం.
భారత లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా బౌలింగ్‌లో మునుపటి మాయాజాలం లేదు. ఇప్పుడు మిశ్రా వయసు 38 ఏళ్లు. వచ్చే ఏడాది కాంట్రాక్ట్ ముగిసి కొత్తగా మళ్లీ ఐపీఎల్ వేలంలోకి రావడం అంత సులువు కాదు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్. ఇప్పటివరకూ 92 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్‌కు ఇదే ఆఖరి ఐపీఎల్ అయ్యే అవకాశం ఉంది. తరచుగా గాయాల బారిన పడటం, వయసు(38) మీద పడటం, ఫిట్నెస్ సమస్యలు స్టెయిన్‌ను తప్పుకునేలా చేస్తుంది. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ బౌలర్ ఇమ్రాన్ తాహీర్. 42 ఏళ్ల వయసులో కుర్రాళ్లకు పోటీ ఇవ్వడం అంత తేలికేమీ కాదు. ఫిట్నెస్ ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటివరకూ ఐపీఎల్లో 55 మ్యాచ్‌లు ఆడిన తాహిర్ పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు.