Fake News: ఆర్బిఐ 500 రూపాయల నోట్లను రద్దు చేసిందా.. ముఖ్యంగా ప్రత్యేక సిరీస్ నెంబర్ ఉన్న నోట్లను చలామణి నుంచి తొలగించిందా... దీనిపైన ఆర్బీఐ ఏమంటోంది.. ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిజానిజాలను కూడా నిర్ధారణ చేద్దాం.
RBI: కరెన్సీ నోట్ల చెలామణి పైన పూర్తి అధికారం ఆర్బిఐ మాత్రమే. కరెన్సీ నోట్ల ముద్రణ అదే విధంగా వాటి పంపిణీ వడ్డీ అన్ని విషయాల్లోనూ ఆర్బిఐ తుది నిర్ణయం. అయితే ఈ మధ్యకాలంలో ఆర్బిఐ పేరిట ఫేక్ సమాచారం అనేది సోషల్ మీడియాలో పెరిగిపోయింది. ముఖ్యంగా ఫలానా నోట్లు రద్దు అయిపోయాయని అలాగే ఫలానా నోట్లు మార్కెట్ నుంచి డిమానిటైజ్ చేశారని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్లు వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా 500 రూపాయల నోట్లపై సిరీస్ నెంబర్లో నక్షత్రం గుర్తు ఉన్నట్లయితే ఇకపై ఆ నోట్లు చెల్లుబాటు కావని సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతుంది. దీంతో పలువురు వ్యాపారులు 500 రూపాయల నోట్లపై ఇలా నక్షత్రం గుర్తు ఉన్న వాటిని స్వీకరించడం కూడా మానేస్తున్నారు.
దీంతో ఆర్బిఐ నేరుగా రంగంలోకి దిగి దీనిపై వివరణ ఇచ్చింది. సిరీస్ నెంబర్ మధ్యలో నక్షత్రం ఉన్న నోట్లు చెల్లుబాటు కావు అనేది కేవలం అపోహ మాత్రమే అని. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలు ఫేక్ మెసేజెస్ అని వాటిని పరిగణలోకి తీసుకోవద్దని పౌరులకు సూచించింది. దీనిపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఒక వివరణ ఇస్తూ అఫీషియల్ ట్విట్టర్లో పేర్కొంది.
నిజానికి ఇలా స్టార్ మార్క్ ఉన్న నోట్లు అన్నీ కూడా చలామణిలోనే ఉన్నాయని అంతేకాదు 2016 నుంచి ఈ నోటు చలామణిలోకి వచ్చాయని వివరణ ఇచ్చింది. దీంతో ఈ నోట్లపై ఉన్న అపోహలను వ్యాపారులు తొలగించుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 500 రూపాయల నోట్లను వేటిని కూడా డిమానిటైజ్ చేయలేదని ఈ సందర్భంగా తెలిపింది.
మరోవైపు మన దేశంలో ఇదే తరహాలో గతంలో పది రూపాయల నాణేలను కూడా ఆర్బిఐ నిషేధించింది అంటూ వార్తలు చలామణి అయ్యాయి. అయితే దీనిపై కూడా ఇటీవల ఆర్బిఐ క్లారిటీ ఇచ్చేసింది. పది రూపాయల నాణేలు అన్నీ కూడా చలామణిలోనే ఉన్నాయని, ఎలాంటి సందేహం లేకుండా పది రూపాయల నాణేలను వ్యాపారులు స్వీకరించవచ్చని కూడా తెలిపింది.
అలాగే 10 రూపాయల నాణేలను బ్యాంకులు తమ కస్టమర్లకు ఇవ్వవచ్చు అని కూడా పేర్కొంది. అలాగే ఐదు రూపాయల నోట్లు సైతం చలామణిలో ఉన్నాయని కూడా ఇటీవల ఆర్బిఐ పేర్కొంది. కస్టమర్లు బ్యాంకుల నుంచి సమాచారం పొందాలని ఈ సందర్భంగా ఆర్బిఐ సూచించింది.