Grandson Suicide Note Viral: తాత మనవళ్ల అనుబంధం విడదీయరానిది. తనను అల్లారుముద్దుగా చూసుకున్న తాత లేకపోవడంతో ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. తాత లేని జీవితం తనకు వద్దని ఆ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన తెలంగాణలో తీవ్ర విషాదం నింపింది. అతడు రాసిన ఆత్మహత్య లేఖ వైరల్‌గా మారింది.
అనుబంధాల్లో తాత మనవళ్ల బంధం చక్కటిది. వీరి అపురూప బంధాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి తాత హఠాన్మరణంతో ఓ మనవడు తట్టుకోలేకపోయాడు.
తాత మరణాన్ని జీర్ణించుకోలేని మనవడు మనస్తాపంతో ఉంటూ మూడు నెలల తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అతడు ఆత్మహత్య చేసుకునే ముందు రాసుకున్న చిన్నపాటి లేఖ తాతతో ఆ యువకుడికి ఉన్న అనుబంధం వివరిస్తోంది.
హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొంపల్లి శివాలయం సమీపంలో మనోజ్(27) కుటుంబం నివసిస్తోంది. అతడి తాత మూడు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు.
తాత మరణించినప్పటి నుంచి మనోజ్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. 'తాత నన్ను రమ్మంటున్నాడు. తాత వద్దకు వెళ్తాను' అంటూ తరచూ ఇంట్లో చెప్పేవాడు.
ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు చిన్న పేపర్‌పై ఆత్మహత్య కారణం వివరించాడు. 'అమ్మనాన్న క్షమించండి. నాకు తాత చాలా గుర్తొస్తున్నాడు.. అందుకే వెళ్లిపోతున్నా ' అంటూ మనోజ్ రాసిన సూసైడ్ నోట్ ఆవేదనకు గురి చేస్తోంది.