Success Story : అసాధ్యం అనే పదానికి అర్థం తెలియని సుసాధ్యుడు.. జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర జీవన ప్రస్థానం

Success Story of Subhash Chandra: కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం  ఇచ్చిన నినాదం నేటి యువతకు ఎంతో అవసరం. అలాగే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన  వ్యక్తుల జీవితాలను సైతం తెలుసుకోవడం యువతకు అత్యంత అవసరం. హర్యానాలోని ఒక కుగ్రామానికి చెందిన ఒక యువకుడు తన జేబులో 17 రూపాయలతో జీవితం ప్రారంభించి నేడు భారత మీడియా మొఘల్ గానూ, ఎస్సెల్ గ్రూప్‌కు చైర్మన్ స్థాయికి ఎదిగిన  అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఆయనే సుభాష్ చంద్ర గోయెంకా..జీ మీడియా, ఎస్సెల్ గ్రూప్ అధినేతగా మనందరికీ సుపరిచితులు. డాక్టర్ సుభాష్ చంద్ర 30 నవంబర్, 1950న హర్యానాలోని హిసార్ జిల్లాలోని అడంపూర్ మండిలో సాంప్రదాయ బనియా కుటుంబంలో జన్మించారు. 

1 /10

తాత వద్ద వ్యాపార సూత్రాలు: ఆయన తండ్రి నందకిషోర్ గోయెంకా ఆహార ధాన్యాల కొనుగోలు, అమ్మకం వ్యాపారం చేసే ఒక చిన్న వ్యాపారవేత్త. తల్లి, తారా దేవి సాధారణ గృహిణి. సుభాష్ చంద్రా తన తల్లిదండ్రులకు ఉన్న 7గురు సంతానంలో అందరికన్నా పెద్దవాడు. ఆయన ప్రాథమిక విద్య హిసార్‌లోని ఉన్నత పాఠశాలలో జరిగింది. వ్యాపారం అతని రక్తంలో ఉంది. చిన్న వయస్సులోనే తన తాత  జగన్నాథ్ గోయెంకా నుంచి  వ్యాపార మూల సూత్రాలు నేర్చుకోవడమే కాదు. జీవితంలో  ఉపయోగపడే అనేక పాఠాలను ఆయన నేర్చుకున్నారు.  అవి ఆయన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు ఉపయోగపడ్డాయి. 

2 /10

అప్పులతో మొదలైన ప్రయాణం: 16 ఏళ్ల యువకుడిగా సుభాష్ పెద్దయ్యాక ఇంజనీర్ కావాలని కలలు కన్నాడు. కానీ  తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు  1967లో గోయెంకా కుటుంబం తమ వ్యాపారంలో వరుస నష్టాలను చవిచూసింది. కొత్తగా స్థాపించిన  ఆదర్శ్ కాటన్ జిన్నింగ్ అండ్ ఆయిల్ ఇండస్ట్రీస్  పత్తి వ్యాపారంలో తీవ్ర నష్టాల కారణంగా మూతపడాల్సి వచ్చింది. దీంతో వారి కుటుంబానికి 6 లక్షల రూపాయలకు పైగా భారీ అప్పులు మిగిలాయి. దీంతో తన కళాశాల ఫీజు చెల్లించలేక పాఠశాల విద్యకు స్వస్తి పలకాల్సి వచ్చింది. 

3 /10

వ్యాపారంలో తొలి విజయం: 1969లో స్కూలును  విడిచిపెట్టిన దాదాపు 2 సంవత్సరాల తరువాత, సుభాష్ చంద్ర ఒక FCI (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) మేనేజర్‌ని కలవడంతో అతని జీవితం ఒక మలుపు తిరిగింది. ఎఫ్‌సిఐ నుండి ముడి పప్పు, ధాన్యం తీసుకొని వాటిని పాలిష్ చేసే కాంట్రాక్టు దక్కడంతో ఆయన  వ్యాపారంలో వేసిన తొలి అడుగులోనే విజయం సాధించాడు. సుభాష్ కుటుంబం అప్పటికే పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంది. దీంతో కొత్తగా పెట్టుబడి అవసరం లేకుండా పోయింది. సుభాష్ పనితీరుకు మెచ్చి FCI అతనికి మరిన్ని కాంట్రాక్టులను ఇచ్చింది.  అతను 1976 వరకు ఈ వ్యాపారాన్ని కొనసాగించాడు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ  తాను 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తన తండ్రికి ఫియట్ కారు కొనాలని కోరిక ఉండేదని కానీ  ఆర్థిక పరిస్థితి పరిమితించకపోవడంతో కొనలేకపోయానని తెలిపారు.  కానీ పట్టుదలతో  వ్యాపారంలో రాణించి తనకు 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు సెకండ్ హ్యాండ్ ఫియట్ కారు కొని తండ్రి  కోరిక  తీర్చినట్లు ఆయన తెలిపారు.  దీనిబట్టి ఆయన దీక్ష దక్షత ఎలాంటిదో తెలుసుకోవచ్చు

4 /10

ఎస్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు పునాది: FCI నుంచి  బ్యాక్ టు బ్యాక్ భారీ కాంట్రాక్టులు పొందడంతో, సుభాష్ వద్ద పెద్ద మొత్తంలో నగదు వచ్చి చేరింది. దీంతో ఆయన కుటుంబ వ్యాపారాన్ని ఒక వ్యాపార సంస్థగా మలిచేందుకు ఎస్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌గా పేరు మార్చి ఒక నూతన అధ్యాయానికి తెరలేపారు.  వినూత్న వ్యాపార ఆలోచనలకు సుభాష్ చంద్ర పెట్టింది పేరు. FCIతో ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌ కాంట్రాక్ట్ వ్యాపారంలో విజయం సాధించిన తర్వాత ఆయన ఫార్మాస్యూటికల్ పరిశ్రమల కోసం ఖాళీ క్యాప్సూల్స్, ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్, లామినేట్‌లను తయారు చేసే లామినా ప్యాకర్స్‌ ఉత్పత్తులను తయారు చేశారు. అదే సమయంలో ఒక హ్యాండ్ టూల్స్ తయారీ పరిశ్రమను కూడా కొనుగోలు చేశారు.   

5 /10

1981లో సుభాష్ చంద్ర సోవియట్ రష్యాకి బియ్యాన్ని ఎగుమతి చేసే రూ. 16 కోట్ల డీల్‌ని పొందారు. కంపెనీ అందిస్తున్న ఉత్పత్తులకు అధిక నాణ్యత, నాణ్యమైన సేవ కారణంగా, సోవియట్ రష్యా ప్రభుత్వం ఎస్సెల్ గ్రూపుతో చేసుకున్న ఒప్పందాలను వరుసగా 5 సంవత్సరాలు కొనసాగించింది. దీంతో కేవలం 15 సంవత్సరాలలో సుభాష్ చంద్ర తన కుటుంబ వ్యాపారాన్ని దివాలా అంచుల నుంచి  ఒక బిలియన్ కంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీగా మార్చాడు.  

6 /10

ప్యాకేజింగ్ ప్రపంచంలో తిరుగులేని ప్రస్థానం: సుభాష్ చంద్ర ప్యాకేజింగ్ రంగంలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో భాగంగా జర్మనీ నుండి సాఫ్ట్ ప్లాస్టిక్ ట్యూబ్‌ల తయారీ సాంకేతికతను కొనుగోలు చేసి, టూత్‌పేస్ట్, ఫార్మా పరిశ్రమల కోసం సాఫ్ట్ ప్లాస్టిక్ ట్యూబ్‌లను ఉత్పత్తి చేయడానికి ఎస్సెల్ ప్యాకేజింగ్‌ను స్థాపించారు. ప్రారంభంలో అడ్డంకులు  నష్టాలను ఎదుర్కొన్న తర్వాత, Essel ప్యాకేజింగ్ లామినేటెడ్ ట్యూబ్‌ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీదారుగా మారింది. మొత్తం 13 దేశాలలో ఉనికిని కలిగి ఉంది. ఎస్సెల్ ప్యాకేజింగ్ విజయవంతమైన తర్వాత, సుభాష్‌కి మళ్లీ కొత్తదనం కోసం ముంబైలోని గోరాయ్‌లో 753 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దేశంలో తొలిసారిగా 1989లో ఎమ్యూజ్ మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్‌ను పరిచయం చేశారు. 

7 /10

మీడియా ప్రపంచంలోకి అడుగులు: సుభాష్ చంద్ర గోయంకా తన ప్రస్థానంలో అతి పెద్ద అడుగు మీడియా రంగం ద్వారా వేశారు. దూరదర్శన్ నుండి ప్రేరణ పొందిన ఆయన తన స్వంత టెలివిజన్ ఛానెల్‌ని ప్రారంభించటానికి 1990లో జీ నెట్‌వర్క్‌ని స్థాపించారు. అప్పటి నిబంధనల ప్రకారం,  మనదేశంలో ప్రైవేటు  శాటిలైట్ ఛానల్స్  ఏర్పాటుకు అనుమతి లేదు.   అయితే విదేశీ చానల్స్ కు మాత్రం  ఇక్కడ  ప్రసారం చేసుకునే అనుమతి ఉంది.   

8 /10

దీంతో  భారత ప్రభుత్వం నుండి ఎలాంటి క్లియరెన్స్ లేకపోయినా సుభాష్ చంద్ర ఎంతో తెలివిగా హాంకాంగ్ ఆధారిత ఎంపైర్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరును 1992లో Zee టెలిఫిల్మ్స్ లిమిటెడ్‌గా మార్చి  Zee TV హాంగ్ కాంగ్‌కు కంటెంట్‌ను అందించేవారు. అక్కడి నుంచి తిరిగి సిగ్నల్స్ మన దేశానికి వచ్చేవి.  మొదట్లో కేవలం మూడు గంటల ప్రోగ్రామింగ్‌తో ప్రారంభించారు, తర్వాత దానిని ఆరు గంటలకు పెంచారు. జీ టీవి ఆగమనంతో దూరదర్శన్ గుత్తాధిపత్యానికి తెరపడింది.  

9 /10

అలా ప్రారంభమైన జీ మీడియా గ్రూప్ ప్రస్థానంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ప్రస్తుతం జీ మీడియా గ్రూపు 500 మిలియన్ల వీక్షకులతో 167 దేశాలలో ఉనికిని కలిగి ఉంది. మొత్తం దాదాపు 10,000 మంది ఉద్యోగులతో 4 బిలియన్ డాలర్ల నిర్వహిస్తున్నారు. ఇక ఎస్సెల్ గ్రూప్ ప్రస్తుతం ఆయన కుమారులు పునీత్, అమిత్ నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ మీడియా, టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్, ప్యాకేజింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెటల్, ఎడ్యుకేషన్  అనేక ఇతర స్వచ్ఛంద సంస్థల వంటి వివిధ రంగాలలో విస్తరించింది. సుభాష్ చంద్ర యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌లో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.   

10 /10

సామాజిక సేవలో: 1997లో, డాక్టర్ సుభాష్ చంద్ర ముంబైలోని బోరివలిలో గ్లోబల్ విపాసన పగోడా (ఆలయం) నిర్మించడానికి 13 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు.  జీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా ఏకల్ గ్లోబల్- ఒక ఉపాధ్యాయుడు-ఒక పాఠశాల సూత్రం ద్వారా భారతదేశం అంతటా 50,000 కంటే ఎక్కువ పాఠశాలలను గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో నడిపి నిరక్షరాస్యతను నిర్మూలించడంలో ముందడుగు సహాయపడ్డారు. TALEEM అనే కార్యక్రమం ద్వారా నిరుపేద యువకులకు వృత్తిపరమైన విద్యను అందించారు.