సూర్యాపేట: హుజూర్‌నగర్ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు పోటీచేసేందుకు బీజేపీ యువనేత రామారావు ఆ పార్టీ తరపున సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం రామారావు మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఎంతో మేలు చేశామని చెప్పుకునే కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు బీసీలకు అసలు టికెటే ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మను అధికార టీఆర్‌ఎస్ పార్టీ పట్టించుకోనేలేదని ఆరోపించారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తీరుపై విమర్శలు సంధించిన రామారావు.. ఆంధ్రా నుంచి వచ్చిన సైదిరెడ్డికి టీఆర్‌ఎస్ పార్టీ టికెట్ కేటాయించారన్నారు. మరోవైపు మంత్రి జగదీష్ రెడ్డి హుజూర్‌నగర్‌లో పరిశ్రమల నుంచి వచ్చే రూ.300 కోట్ల సెస్సును సూర్యాపేటకు తరలిస్తున్నారని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. హుజూర్‌నగర్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని రామారావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని.. అందుకే హుజూర్‌నగర్‌లో తన గెలుపు ఖాయమని రామారావు ధీమా వ్యక్తంచేశారు.
హుజూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి నామినేషన్