Telangana Legislative Assembly Sessions: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కరెంట్‌పై లొల్లి జరుగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసి లఘు చర్చను ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగ పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముక అని చెప్పారు. వైద్య రంగంలోని అత్యవసర సేవలకైనా, రవాణా, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్తే మొత్తంగా చూస్తే, ఆర్థిక పరంగా, నిర్వహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టంగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి టీఎస్ జెన్ కోలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 4365.26 మెగావాట్లు అని.. రాష్ట్రం ఏర్పాటుకన్నా చాలా ముందుగానే తెలంగాణలో 2960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ప్రణాళికలు, పనులు అప్పటి తమ ప్రభుత్వం ప్రారంభించిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. ఉత్పత్తి ప్రారంభించిన ఈ కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే తరువాతి కాలంలో రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడి స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యానికి అదనంగా 1800 మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా కూడా అప్పటి తమ ప్రభుత్వం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చట్టంలో రూపొందించినట్లు డిప్యూటీ సీఎం వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేసినది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మాత్రమేనని.. ఈ ప్రాజెక్టు కూడా పూర్తి కావడానికి చాలా కాలం పట్టిందన్నారు.
ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించడంతో ఇన్వెస్ట్‌మెంట్ ఖర్చు కూడా భారీగా పెరిగిపోయిందన్నారు. బొగ్గు గనులకు అత్యంత దూరంగా 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు దూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ వ్యయంలో కేవలం బొగ్గు సరఫరా అదనపు వ్యయమే ఏడాదికి రూ.800 కోట్లు, ప్రాజెక్టు జీవితకాలం 30 ఏళ్లు అనుకుంటే.. ఈ ఖర్చు మరింత భారీగా ఉండబోతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకర స్థితిలో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
డిస్కంలు ఇప్పటివరకు మొత్తం రూ.62,461 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి మొత్తం అప్పులు రూ.81,516 కోట్లుగా ఉందన్నారు. ఈ అప్పుల మొత్తంలో రూ.30,406 కోట్లు కరెంటు సరఫరా చేసిన జనరేటర్లకు బకాయిలు చెల్లించడం కోసం తీసుకున్నట్లు వివరించారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ.28,673 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉందన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిల కారణంగా విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఒక్క సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలు రూ.14,193 కోట్లు ఉన్నాయన్నారు. ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తానని మాట తప్పిన రూ.14,928 కోట్ల భారం డిస్కంల ఆర్థిక స్థితిని మరింత కుంగదీశాయన్నారు.
Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook