దీపావళి పర్వదినాన్ని చిన్నారులతో ప్రత్యేకంగా జరుపుకున్నారు తెలంగాణ ఐటీ శాఖకు ఆపద్దర్మ మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే సంస్థకు చెందిన చిన్నారులకు స్వీట్లు, పటాకులు పంచిపెట్టి వారికి ఓ కొత్త ఉత్సాహాన్ని అందించారు. చిన్నారులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకున్న అనంతరం అక్కడి చిన్నారులకు ఏడాదిపాటు కనీస అవసరాల నిమిత్తం సంస్థకు రూ. 12 లక్షల చెక్కును కేటీఆర్ విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దీపావళి పర్వదినాన్ని ఇలా చిన్న పిల్లలతో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. చాలా ఏళ్ల తర్వాత తనకు ఇదే అత్యుత్తమమైన దీపావళి అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ సంస్థకు చెందిన చిన్నారులకు ధాతలు అందరూ అండగా నిలిస్తే, వారు కూడా భవిష్యత్లో ఉన్నతశిఖరాలు అధిరోహిస్తారని కేటీఆర్ అన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో సంస్థకు ఎలాంటి అవసరం ఉన్నా తనను నిరభ్యంతరంగా సంప్రదించవచ్చని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. కేటీఆర్ ఔదార్యానికి సంస్థ ప్రతినిధులు సైతం కృతజ్ఞతలు తెలిపారు.