తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈ రోజు ఆ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుదల చేశారు.ఈ సంవత్సరం తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. అందులో 2,84,224 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను 4,29,378 మంది విద్యార్థులు రాయగా.. 2,88,772 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఈ క్రమంలో మొదటి సంవత్సరంలో 62.3%, రెండవ సంవత్సరంలో 67% ఉత్తీర్ణతశాతం నమోదైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థులకు సంబంధించి మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో కొమురం భీం జిల్లా, మెహబూబూబాద్ జిల్లాలు ఉన్నాయి. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి కొమరం భీం జిల్లా తొలి స్థానంలో నిలవగా, రంగారెడ్డి జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం గమనార్హం.
ఈ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో బాలల కన్నా, బాలికలే మెరుగైన ఫలితాలను పొందడం విశేషం. మొదటి సంవత్సరంలో బాలికలు 69% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేయగా, బాలలు కేవలం 55.66 % ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో బాలికలు 73.2 % శాతాన్ని నమోదు చేయగా, బాలలు 61% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు.
ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రీకౌంటింగ్ లేదా రీవాల్యుయేషన్‌కు దరఖాస్తుకు చేసుకోవాలని భావిస్తే.. ఏప్రిల్ 20 వరకు గడువు విధించినట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ ఫలితాలను www.tsbie.cgg.gov.in, www.results.cgg.gov.in, www.bie.telangana.gov.in వెబ్ సైట్లలో చూడవచ్చు. అలాగే ‘టీఎస్‌బీఐఈ సర్వీసెస్’ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫలితాలను విద్యార్థులు వీక్షించవచ్చు. అదేవిధంగా జూనియర్ కళాశాలల ప్రతినిధులు తమ కాలేజీల వారీ ఫలితాలను తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి http://admin.tsbie.cgg.gov.in వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.