టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు యువ నాయకుడి పేరు ఖరారు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో ఓ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. 

Last Updated : Mar 5, 2018, 02:04 PM IST
టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు యువ నాయకుడి పేరు ఖరారు

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో ఓ అంతిమ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మొదటిగా పార్టీ ప్రధాన కార్యదర్శి, యువ నేత జోగినపల్లి సంతోష్‌ కుమార్‌కు రాజ్యసభ సీటు ఖరారైంది. మరో సీటును యాదవులకు కేటాయిస్తానని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. అయితే, ఎటొచ్చీ ఈ సీటు కోసం రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటమే కొంత అయోమయానికి దారితీస్తోంది. 2014 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్‌లో చేరిన నోముల నర్సింహ్మయ్య(సీపీఐ మాజీ నేత), రాజయ్య యాదవ్, కానీ లేదా మరెవరైనా ఓ మహిళకు ఇచ్చే ఆలోచన చేస్తే తుల ఉమ పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 
 
ఈ ముగ్గురిలోనూ నోములు నర్సింహ్మయ్యకే అవకాశాలు అధికంగా వున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌లో చేరి నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నోముల.. ప్రస్తుతం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇక జోగినపల్లి సంతోష్ కుమార్‌ని రాజ్యసభకు ఎంపిక చేయడంపై పెద్ద వ్యూహమే వున్నట్టు టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి సారిస్తున్న ప్రస్తుత తరుణంలో సంతోష్ కుమార్ ఎంపిక వెనుక భారీ వ్యూహమే నడిచిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. 

 

Trending News