ఇండోనేషియాలోని లాంబాక్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. ద్వీపంలో 7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 82 మంది మృత్యువాతపడ్డారు. వందలాది మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. బాలి విమానాశ్రయంలో భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సునామీ వచ్చే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.
భూకంపం ధాటికి ద్వీపంలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి కేవలం 10 కి.మీ లోతున ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే పేర్కొంది. కాగా వారం రోజుల క్రితమే లాంబాక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం వచ్చి 17 మంది మరణించారు. వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ప్రకృతి విపత్తు సంస్థ అధికార ప్రతినిధి ఇప్పటి వరకు 82 మంది మరణించినట్టు చెబుతుండగా, అధికారులు మాత్రం 39 మంది మాత్రమేనని చెబుతున్నారు. అయితే, ప్రాణ, ఆస్తినష్టంపై స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువ. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఈ దేశం ఉంది. 2004లో వచ్చిన ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపం (9.3 తీవ్రత పెను విధ్వంసాన్నే సృష్టించింది. ఈ భూకంపానికి సునామీ తోడై ఇండోనేషియాలోనే 1,68,000 మంది మరణించగా.. మొత్తం హిందూ మహాసముద్రం వ్యాపించి ఉన్న దేశాల్లో 2,20,000 మంది చనిపోయారు.