నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను.. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ అని ఆయన రాసిన గేయం ఎంతమంది యువతను తట్టిలేపిందో మనకు తెలియంది కాదు. పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు చేసిన మహోన్నత గ్రంథమే శ్రీశ్రీ రాసిన "మహా ప్రస్థానం" అనడంలో అతిశయోక్తి లేదు. కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వంటి విమర్శకులు అందుకే శ్రీశ్రీని కవితా హోమగుండంగా అభివర్ణిస్తుంటారు. శ్రీశ్రీ తెలుగు కవిత్వ దశ, దిశను మార్చిన ఓ వెలుగు దివ్వె. ఆయన జయంతి సందర్భంగా ఈ వ్యాసం మీకోసం ప్రత్యేకం
శ్రీశ్రీ జయంతి ఏ రోజు అన్న విషయంపై పలు అపోహలు, అనుమానాలు ఉన్నప్పటికీ.. విశాఖపట్టణం పురపాలక సంఘం రికార్డుల ప్రకారం ఆయన ఏప్రిల్ 30, 1910 తేదిన జన్మించారని విరసం సంస్థ స్పష్టం చేయడంతో అదే రోజున ఆయన జయంతిని జరుపుతున్నారు. శ్రీశ్రీ అసలు ఇంటి పేరు పూడిపెద్ది వారు. పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు విశాఖపట్నంలో జన్మించిన శ్రీనివాసరావును శ్రీరంగం సూర్యనారాయణ దత్తత తీసుకోవడం వల్ల.. ఆయనకు శ్రీరంగం ఇంటి పేరు సంక్రమించింది.
ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తిచేసిన శ్రీశ్రీ, 1925లో తన పదవ తరగతి ప్యాసయ్యాడు. అదే సంవత్సరం వివాహమూ చేసుకున్నాడు. 1931లో మద్రాసు విశ్వవిద్యాలయంలో బీఏ (జంతుశాస్త్రం) పూర్తిచేసి మళ్లీ విశాఖ వచ్చి ఏవీఎన్ కళాశాలలో డిమాన్ స్ట్రేటర్‌గా పనిచేశారు. 1938లో మద్రాస్ వెళ్లి ఆంధ్రప్రభలో సబ్ ఎడిటరుగా చేరారు. ఆ తర్వాత అనేక ఉద్యోగాలు చేశాడు శ్రీశ్రీ. మిలట్రీలో చేరాడు. నవాబు దగ్గర కొలువు కూడా చేసాడు. ఆఖరికి సినీ రంగం వైపుకి కూడా వెళ్లాడు.
శ్రీశ్రీ రచనా వ్యాసంగం విషయానికి వస్తే ఆయనకు చిన్నప్పటి నుండే ఆ అలవాటు ఉంది. తన 18వ ఏటనే తొలిసారిగా "ప్రభవ" అనే కావ్య సంపుటిని రాసాడు. పూర్తి సాంప్రదాయరీతిలో ఆ కావ్యం రాసిన తర్వాతి కాలంలో గురజాడే తన అడుగుజాడ అని చెప్పిన కవి శ్రీశ్రీ... వాడుక భాషలో.. అందులోనూ మాత్రా ఛందస్సులో మాత్రమే కవిత్వం రాయాలని సంకల్పించాడు.
అదే స్ఫూర్తితో వాడుక భాషలో మాత్రా ఛందస్సులో మహాప్రస్థానం, జగన్నాథుని రథచక్రాలు, బాటసారి, భిక్షువర్షీయసి వంటి కవితలు ఎన్నో రాశాడు. అవే కవితలతో ఒకటి తర్వాత ఒక సంపుటిని కూడా తీసుకొని వచ్చాడు. ఆ కవితా సంపుటి పేరే "మహాప్రస్థానం". నేనొక దుర్గం.. నాదొక స్వర్గం, అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం..అని తానే స్వయంగా ప్రకటించుకున్న శ్రీశ్రీ ఏ సిద్ధాంతానికీ, ఏ దృక్పథానికీ చెందిన కవి కాదు. అయినా 1955లో ఆయన కమ్యూనిస్టుల తరఫున ఎన్నికల ప్రచారం చేశాడు. 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమప్పుడు శ్రీశ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి ఖమ్మంలో సమైక్య వాదాన్ని వినిపించాడు.
సినీ రంగంతో శ్రీశ్రీకి పరిచయం ఏర్పాడ్డాక ఆయన హెచ్.ఎం.రెడ్డి, బి.విఠలాచార్య లాంటి వారి సినిమాలకు పాటలు రాశాడు. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 1974లో శ్రీశ్రీ రాసిన "తెలుగు వీర లేవరా" అనే పాట తనకు జాతీయ పురస్కారాన్ని తీసుకొచ్చి పెట్టింది. ప్రాసకూ, శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ తనకు తానే సాటి. మొదటి భార్య చనిపోయాక ఆయన సరోజ అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బాలల కోసం "సిరిసిరి మువ్వ" శతకం రాశారు.
పలుమార్లు విదేశీ పర్యటనలు కూడా చేసిన శ్రీశ్రీ అమెరికాకి కూడా వెళ్లాడు. అలాగే సోవియట్ ల్యాండు అవార్డు కూడా అందుకున్నారు. అభ్యుదయ రచయితల సంఘానికి (అరసం) అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీశ్రీ.. ఆ తర్వాత తానే అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం (విరసం)ను ఏర్పాటు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. అలాగే శ్రీశ్రీతన ఆత్మకథను "అనంతం" పేరుతో అక్షరబద్ధం చేశారు. తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు అన్నింటినీ అందులో పొందుపరిచారు. 1983, జూన్ 15 తేదిన క్యాన్సర్ వ్యాధికి గురై మరణించారు శ్రీశ్రీ. శ్రీశ్రీ స్మృత్యర్థం విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.