క్షుద్ర అనే పదంలోనే వర్ణ వివక్ష ఉందని గుంటూరు జిల్లా నాస్తిక సమాజం ఓ ప్రకటనలో తెలిపింది. శూద్రులు పూజించే గ్రామదేవతలను క్షుద్ర దేవతలని, బ్రాహ్మణులు పూజించే దేవతలను పురాణ పురుషులని భావించే వివక్ష సనాతన మతాచారాల్లో కొనసాగుతుందని ఆ సంస్థ ప్రకటించింది. ఒకప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ కూడా గ్రామదేవతగానే ఉండేదని.. కాలక్రమంలో శూద్ర పూజారుల నుండి బ్రాహ్మణ పూజారులు ఈ గుడిని సొంతం చేసుకున్నారని ఓ ప్రకటనలో ఆ సమాజం ప్రతినిధులు తెలిపారు.
కాలానుగుణంగా నరబలులు, జంతు బలులు, కొన్ని రకాల పూజా విధానాలను మార్చుకుంటూ వచ్చిన చరిత్రలాగే, నేడు ప్రజలను భయపెట్టే, భ్రమ పెట్టే దుష్ట ఆచారాలను చట్టబద్ధంగా నిషేధించడం ఈ కాలపు అవసరంగా గుర్తించమని మత విశ్వాసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నామని సమాజం తెలిపింది.
ఫిబ్రవరి 10, 11 తేదీల్లో 26వ జాతీయ నాస్తిక మేళాను గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రకటనను సమాజం ప్రతినిధులు విడుదల చేశారు. ఈ మేళాకి డాక్టర్ బివి రాఘవులు, కత్తి పద్మారావు, సి.హెచ్.శివారెడ్డి మొదలైనవారు హాజరు కానున్నారు. ఈ మేళా సందర్భంగా పెరియార్ జీవిత చరిత్రను కూడా ప్రదర్శించనున్నారు. అలాగే "దేవుడు, మహిమలు నిరూపించండి..! పది లక్షల రూపాయలను బహుమతిగా కూడా పొందండి" అంటూ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.