రాళ్లదాడి ఘటనపై చంద్రబాబు సీరియస్

తిరుమలలో అమిత్ షా వాహనాన్ని అడ్డగించి పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పై రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే.

Last Updated : May 11, 2018, 03:57 PM IST
రాళ్లదాడి ఘటనపై చంద్రబాబు సీరియస్

తిరుమలలో అమిత్ షా వాహనాన్ని అడ్డగించి పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పై రాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ కార్యకర్తలైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పార్టీకి మచ్చ తీసుకువచ్చే ఏ పని కూడా చేయవద్దని.. పోరాటం చేస్తున్న సమయంలోనే మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ధర్మపోరాటం సాగుతూనే ఉంటుందని.. అందులో ఎలాంటి అనుమానం లేదని చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం అభివృద్ది దిశగా పయనిస్తుందంటే.. అందులో కేంద్రం చేసినదేమీ లేదని.. అంతా రాష్ట్ర ప్రజల కష్టంతోనే సాధ్యమైందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు

అలాగే అమిత్ షా వాహనంపై రాళ్ల దాడి జరగడం బాధాకరమైన సంఘటన అని.. అయితే బీజేపీ నేతల రెచ్చగొట్టే ధోరణి వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని మరోమంత్రి సోమిరెడ్డి మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకొని ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆయన వాహనం అలిపిరి చేరుకొనేసరికి అక్కడ నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించిన కొందరు నిరసనకారులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వడానికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే వారిని అడ్డుకొని  పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు

Trending News