టీడీపీ ఎంపీ ఎన్.శివప్రసాద్ ఇప్పటి వరకూ రకరకాల వేషాలు వేస్తూ, ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో తన నిరసనను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దుర్గమ్మ, సత్య సాయిబాబా, అన్నమయ్య, మాయలఫకీరు, నారదుడు, కాటికాపరి, ఎన్టీఆర్ ఇలా రకరకాల వేషాలు వేసిన శివప్రసాద్.. ఇప్పుడు తాజాగా భారత ప్రధానికి వార్నింగ్ ఇస్తూ హిట్లర్ వేషం కూడా ధరించారు.
హిట్లర్ వేషం ధరించి పార్లమెంటు ఆవరణలోకి వచ్చిన టీడీపీ ఎంపీ మాట్లాడుతూ "జర్మనీ ఆర్మీలో ఓ సైనికుడిగా నా కెరీర్ ప్రారంభించాను. ఎంతో గౌరవాన్ని పొందాను. కానీ అహంకారం వల్ల, అత్యాశ వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది ప్రజల మరణానికి కారణమయ్యాను. అదే నేను ఆత్మహత్య చేసుకొనే వరకూ దారి తీసింది. నేను నరేంద్ర మోదీకి ఒకటే చెబుతున్నాను. ఆయన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు సీఎం చంద్రబాబు నాయుడిని కూడా మోసం చేశారు. ఒకవేళ ఆయన తప్పు తెలుసుకోలేకపోతే.. ఆయన గొయ్యిని ఆయన తవ్వుకున్నట్లే. తర్వాత పశ్చాత్తపపడినా ఏమీ మిగలదు" అని హిట్లర్ వేషంలో హితవు పలికారు.
చిత్తూరు నుండి ఎంపీగా పార్లమెంటుకి ఎన్నికైన శివప్రసాద్ గతంలో నాటకాలాడేవారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో కూడా నటించారు. ఉద్యోగ రీత్యా డాక్టరైన శివప్రసాద్ ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం కూడా పొందారు. గత కొంత కాలంగా వేషాల ద్వారా సామాజిక సమస్యలపై గళం విప్పడానికి ప్రయత్నించిన శివప్రసాద్... ఎంపీగా ఎన్నికయ్యాక కొద్ది నెలల నుండి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కోసం.. ఏపీ ప్రభుత్వపు డిమాండ్లను కేంద్రానికి తెలియజేయడం కోసం రకరకాల పగటి వేషాలు వేస్తున్నారు.