ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు-2016కు వ్యతిరేకంగా మంగళవారం భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒక రోజు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. దీంతో బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి.
ఈ చట్టం ప్రకారం ప్రవేట్ వారు ప్రయాణ మార్గాలను కొనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉన్న మార్గాలను ఏ ప్రవేట్ కంపెనీ వారు కొనుకున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులు కనిపించవు. దీంతో అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్కు మద్దతు ప్రకటించిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
పెట్రోల్, డీజీల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు వచ్చే నష్టాలను ప్రభుత్వమే భరించాలని, టోల్గేట్ల నుండి ఆర్టీసీలకు మినహాయింపు ఇవ్వాలని, పెంచిన థర్డు పార్టీ ఇన్సూరెన్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఒక రోజు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. లెఫ్ట్ పార్టీలు, లారీ సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలిపాయి.
'ఈ బిల్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీల ఉనికికే ప్రమాదం. బిల్లు ఆమోదం పొందితే విద్యార్థులకు, ప్రజలకు రవాణా భారమవుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. కాబట్టి కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి.' అని ఆర్టీసీ యూనియన్ నాయకులు పేర్కొన్నారు.
ఇక ఈ వాహనాల సమ్మె కారణంగా ప్రజలు, ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ ముందు జాగ్రత్తగా దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను నిలిపివేసింది. అటు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లతో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్టణం, కర్నూలు నగరాల్లోని బస్టాండుల్లో ప్రజలు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు.