నటీనటులు : అనుష్క, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశ శరత్, మురళీ శర్మ, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖ రామన్, దేవ దర్శిని, తలైవాసల్ విజయ్, అజయ్ ఘోష్, మధు నందన్, తదితరులు.
మ్యూజిక్ : ఎస్.ఎస్. థమన్
సినిమాటోగ్రఫీ : ఆర్.మథి
నిర్మాణం : యు.వి.క్రియేషన్స్
నిర్మాతలు : వంశీ, ప్రమోద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : అశోక్
రిలీజ్ డేట్ : 26-01-2018
‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ వంటి క్యారెక్టర్స్ తో ఎంటర్ టైన్ చేసిన అనుష్క ఈరోజే భాగమతిగా థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చింది. అశోక్ డైరెక్షన్ లో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేసిందో.. తెలుసుకుందాం.
కథ:
ఈశ్వరప్రసాద్ (జయరాం) ఓ సెంట్రల్ మినిస్టర్. ఇతడి దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ చంచల. జయరాంను ఓ మంచి వ్యక్తిగా భావిస్తుంటుంది. కానీ జయరాం మాత్రం అక్రమాలు, స్కామ్ లు చేస్తుంటాడు. ఒక సందర్భంలో ప్రాణాధార అనే ప్రాజెక్టు కోసం కొన్ని ఊళ్లు ఖాళీ చేయించాల్సి వస్తుంది. అలాంటి ఊళ్లకు అండగా ఉండే శివను చంచల ప్రేమిస్తుంది. అయితే ప్రభుత్వ అంచనా ప్రకారం ఖాళీ చేయించాల్సిన ఊళ్లతో పాటు అదనంగా మరికొన్ని గ్రామాల్ని కూడా ఖాళీ చేయించే పథకాన్ని పన్నుతాడు జయరాం. అడ్డంగా ఉన్న శివను చచ్చిపోయేలా చేసి, ఆ కేసును చంచలపై వేస్తాడు. ఇంటరాగేషన్ కోసం చంచలను భాగమతి బంగ్లాకు తీసుకెళ్తారు. అక్కడ చంచలను భాగమతి ఆవహిస్తుంది. ఇంతకీ చంచలకు, భాగమతికి సంబంధం ఏంటి..? తను ప్రేమించిన శివను చంపిన జయరాంను చంచల ఏం చేసింది..? జయరాం అక్రమాల్ని ఎలా బయటపెట్టింది అనేది స్టోరీ.
నటీనటుల పనితీరు:
చంచల, భాగమతి పాత్రల్లో అనుష్క మరోసారి అద్భుతంగా నటించింది. ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో హుందాగా కనిపిస్తూనే.. ఇది నా అడ్డా అంటూ భాగమతి పాత్రలో మెరుపులు మెరిపించింది. ఓవరాల్ గా సినిమాకు సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనుష్కే. ఇక మంచి మనిషిగా, నలుగురిలో నాలుకలా ఉండే శివ పాత్రలో ఉన్ని ముకుందన్ చక్కగా చేశాడు. వీళ్ల తర్వాత విలన్ పాత్ర పోషించిన జయరాంను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఫస్టాఫ్ లో మంచి మనిషిగా, సెకండాఫ్ లో విలన్ గా జయరాం చక్కటి వేరియేషన్ చూపించాడు. సీబీఐ మహిళా ఆఫీసర్ గా ఆషా శరత్.. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ప్రభాస్ శీను, విద్యుల్లేక తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు:
తమన్, ఆర్ట్ డైరక్టర్ రవీందర్ ఈ సినిమాకు తెరవెనక హీరోలు. ఇలాంటి థ్రిల్లర్ సబ్జెక్ట్ కు మంచి సెట్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అవసరం. ఆ జాబ్ ను రవీందర్, తమన్ చక్కగా పోషించారు. టోటల్ సినిమాకు భాగమతి బంగళా హైలెట్ గా నిలిస్తే.. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ బంగ్లాలోని సన్నివేశాల్ని రక్తికట్టించాడు తమన్. సినిమాకు ఈ రెండు ఎలిమెంట్స్ పెద్ద ప్లస్ పాయింట్స్. మథి సినిమాటోగ్రఫీ కూడా బాగా హెల్ప్ అయింది. ఎడిటింగ్ ఫర్వాలేదు. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
సమీక్ష:
‘అరుంధతి’, ‘రుద్రమదేవి’ సినిమాల తర్వాత భాగమతి అనే పవర్ ఫుల్ టైటిల్ తో అనుష్క సినిమా చేస్తుందనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటివరకూ నిర్మించిన అన్ని సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్న యు. వి. క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కడం, ట్రైలర్ అందరినీ ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచడంతో రిలీజ్ కి ముందే భాగమతి పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది.
సినిమా విషయానికొస్తే ఈ సినిమాకు మెయిన్ హైలైట్ అనుష్క. ఈ కథకి స్వీటీ ను సెలెక్ట్ చేసుకొవడమే దర్శకుడి తొలి విజయం అని చెప్పాలి. గతంలో అంజలి ప్రధాన పాత్రలో చిత్రాంగద అనే హారర్ థ్రిల్లర్ సినిమా తెరకెక్కించి ఎంటర్ టైన్ చేయలేకపోయిన అశోక్ ఈ సినిమాతో ప్రేక్షకులను థ్రిల్ చేశాడు. అయితే భాగమతి లాంటి టైటిల్ పెట్టి ఏదో గొప్ప కథ చెవుతాడనుకునే ప్రేక్షకులను మాత్రం దర్శకుడు నిరాశ పరిచాడు. ఇప్పటికే చూసేసిన కథనే మళ్లీ తన స్క్రీన్ ప్లేతో మేజిక్ చేస్తూ పరవాలేదనిపించాడు. తను అనుకున్న పాయింట్ ని అనుకున్నట్టు తీసినప్పటికీ ఇంకా ఏదో కొత్తదనం ఆశించే వారిని మాత్రం ఇది నిరాశ పరుస్తుంది. మొదటి భాగంలో సస్పెన్స్ తో ప్రేక్షకుడ్ని సీట్ లో కూర్చోబెట్టిన అశోక్ సెకండ్ హాఫ్ లో కాస్త తడబడి కథను రొటీన్ ఫార్మేట్ లోకి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోయాడు.
రెండు షేడ్స్ లో అనుష్క పెర్ఫార్మెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ ఎపిసోడ్, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, ధన్ రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యు రామన్, కామెడీ, సెకండ్ హాఫ్ లో అనుష్క పవర్ ఫుల్ డైలాగ్స్, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్, ప్రీ క్లైమాక్స్ సినిమాలో హైలైట్స్. సెకండ్ హాఫ్ లో రొటీన్ అనిపించే సీన్స్, ఊహించేలా ఉండే క్లైమాక్స్, సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు గతంలో కొన్ని సినిమాలు గుర్తురావడం సినిమాకు మైనస్..
ఓవర్ ఆల్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా భాగమతి ఓ మోస్తరుగా ఎంటర్టైన్ చేస్తుంది.
రేటింగ్ – 3/5
(జీ సినిమాలు సౌజన్యంతో)