తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే లేడీ ఆర్టిస్టులు, హీరోయిన్స్‌పై లైంగిక వేధింపులు ఎక్కువని, లైంగిక వేధింపుల పర్వంపై ఫిర్యాదు చేసినా పట్టించుకునే వాళ్లు వుండరు అని గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌పై యువ నటి శ్రీ రెడ్డి చేస్తోన్న ఆరోపణలు జాతీయ మీడియాకు ఎక్కడం, అలా మీడియా కథనాల ద్వారా శ్రీ రెడ్డి వివాదాన్ని సుమొటోగా తీసుకుంటున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ప్రకటించడం తెలిసిందే. గురువారం ఉదయమే ఈ వివాదంపై వివరణ కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. దీంతో శ్రీ రెడ్డి ఆరోపణలని సుమొటోగా తీసుకుని విచారణ జరిపేందుకు సిద్ధమైనట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు స్పష్టంచేసింది.
ఈ సందర్భంగా మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మీడియాతో మాట్లాడుతూ... " శ్రీ రెడ్డిపై తమకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవని, కేవలం ఆమె తెలుగు సినీ పరిశ్రమపై చేసిన నిరాధారమైన ఆరోపణలు తమను బాధించినందు వల్లే ఆమెపై గతంలో నిషేధం విధించినట్టు" తెలిపారు. ఇకపై మా అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన 900 మంది ఆర్టిస్టులు ఆమెతో కలిసి పని చేయడంపై ఎటువంటి ఆంక్షలు లేవు అని ఈ సందర్భంగా శివాజీ రాజా తేల్చిచెప్పారు.
అంతేకాకుండా శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన శివాజీ రాజా త్వరలోనే లైంగిక వేధింపుల ఫిర్యాదులపై విచారణ జరిపేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. సీనియర్ నటీనటులు, ఫిలిం మేకర్స్ సభ్యులుగా వుండే ఈ కమిటీ ప్రతీ మూడు నెలలకు ఓసారి సమావేశమై తెలుగు సినీ పరిశ్రమలోని పరిస్థితిపై సమీక్ష జరుపుతుంది. లైంగిక వేధింపుల ఫిర్యాదులపై ఈ కమిటీ విచారణ జరుపుతుంది అని శివాజీ రాజా పేర్కొన్నారు.