బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ.. కొన్ని ప్రజా సంఘాలు ఆయన ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నించాయి. పోలీసులు అప్రమత్తమై.. ఇంటి వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో పరిస్థితి కొంతవరకు సద్దుమణిగింది.
అయినా పలువురు ఉద్యమకారులు వాగ్వివాదానికి దిగడంతో.. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి జీపుల్లోకి ఎక్కించారు. ఇప్పటికే రాష్ట్రంలో నెలకొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీకి కొందరు నాయకులు పయనమయ్యారు. యనమల రామక్రిష్ణుడు, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మొదలైన వారు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ పరిస్థితులను వివరించి.. సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకే తాము ప్రయత్నిస్తున్నామని వారు తెలిపారు.