న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు వ్యాపారులకు క్యాష్‌బ్యాక్‌లు, వినియోగదారులకు డిస్కౌంట్లు ఇచ్చే ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వినియోగదారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు చేస్తే.. గరిష్ట చిల్లర ధర(ఎమ్మార్పీ)పై డిస్కౌంట్ ఇచ్చే అంశంపై కేంద్ర రెవిన్యూ విభాగం ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసిందని సమాచారం. సుమారు రూ.100 వరకూ డిస్కౌంట్ ఉండవచ్చని తెలుస్తోంది.
ఇక వ్యాపార సంస్థలకు వాటి డిజిటల్ లావాదేవీల పరిమాణాన్ని బట్టి క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే తమ ప్రతిపాదనల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలికి సమర్పిస్తామని, ఆ తరువాతే నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మే 4న సమావేశం కానుంది. పీఎంవోలో నిర్వహించిన సమావేశంలో ప్రోత్సాహకాల అంశంపై ఉన్నతాధికారులు చర్చించారని విశ్వసనీయ సమాచారం. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గత ఏడాది లక్కీ గ్రాహక్ యోజన, డిజి-ధన్ వ్యాపార్ యోజనను అమలు చేసిన సంగతి తెలిసిందే.