'కరోనా' ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వందల సంఖ్యలో దేశాలను భయపెడుతున్న 'కరోనా వైరస్' భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది.
నిన్నటి వరకు 500 దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ..నేటికి 562కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు 40 మంది కరోనా బాధితులు చికిత్స తీసుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారని తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో నేటి వరకు దేశవ్యాప్తంగా 10 మంది మృతి చెందారు.
మరోవైపు మధ్యప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు ఐదుకు పెరిగింది. అందులో నలుగురు వ్యక్తులు ఇండోర్ కు చెందిన వారు కాగా... మరోవ్యక్తి ఉజ్జయిని చెందిన వారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గుంపులు గుంపులుగా ఉండడాన్ని నిషేధించారు. నిన్నటి నుంచి 21 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. అత్యవసర పనులు, నిత్యావసరాల కోసం తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని సూచించారు.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నిత్యావసరాలు దొరకడం లేదని పలువురు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ కేంద్రపాలిత ప్రాంతాలకు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియాలో కరోనా వైరస్ కు సంబంధించి ఎలాంటి ప్రచారం జరిగినా తీవ్రంగా తీసుకోవాలని సూచించింది.
మరోవైపు జనం నిత్యావసరాల కోసం షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఐతే సోషల్ డిస్టన్స్ పాటించాలని దుకాణదారులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు నిలబడేందుకు నేలపై ముగ్గుతో వృత్తాలు గీస్తున్నారు. ఒక్కొక్కరికి 3 అడుగులు దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
భారత్‌లో 562కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు