బెంగళూరు: మాజీ ప్రధాని దేవే గౌడ త్వరలోనే చనిపోతారని చెబుతూ బీజేపీకి చెందిన ప్రీతమ్ గౌడ అనే ఓ ఎమ్మెల్యే జేడీ(ఎస్) పార్టీకి చెందిన ఎమ్మెల్యే తనయుడికి ఫోన్ చేశారని ఆరోపిస్తూ దేవే గౌడ తనయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ ఆడియో టేప్ విడుదల చేయడం కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. కుమారస్వామి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే వుండటంతో దేవే గౌడ మృతి అనంతరం జేడీ(ఎస్) పార్టీ ఓ చరిత్రగా మిగిలిపోతుందని సదరు ఎమ్మెల్యే చెప్పినట్టుగా వున్న ఆడియో టేప్స్‌ని పలు న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి. అది విని జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. హసన్ జిల్లాలోని ప్రీతమ్ గౌడ ఇంటిపై దాడికి యత్నించారు. ఈ దాడిలో అడ్డు వచ్చిన బీజేపీ కార్యకర్తలు సైతం గాయపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్యే ఇంటిపై దాడిని ఖండించిన కుమారస్వామి.. జేడీ(ఎస్) పార్టీ కార్యకర్తలు కాస్త సమన్వయంతో వ్యవహరించాల్సిందిగా కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ దాడిపై స్పందించిన ప్రీతమ్ గౌడ.. తనను హతమార్చేందుకు జేడీ(ఎస్) కుట్ర పన్నుతోందని ఆరోపించారు.