జీఎస్టీ మండలి చేసిన తాజా ప్రకటన కొందరు వినియోగదారులకు ఉపశమనాన్ని కల్పించవచ్చు. దేశ పౌరుల అవసరాలను పరిగణనలోకి తీసుకొని మరికొన్ని వస్తుసేవలపై జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వం భావించింది. శనివారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని తెలిపారు. కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ రేట్లు జులై 27వ తేది నుండి అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.
ముఖ్యంగా ఈ సారి మహిళల ఆరోగ్య ప్రయోజనాల కోసం శానిటరీ నాప్‌కిన్స్‌పై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే.. రాఖీలు, పాలరాతి ఉత్పత్తులు, మార్బల్స్, రాళ్లు, చెక్కతో తయారుచేసే బొమ్మలు మొదలైన వాటిపై జీఎస్టీని తగ్గించనున్నారు. అలాగే రూ.1000 కంటే తక్కువ ధర ఉన్న చెప్పులపై కూడా జీఎస్టీని 5 శాతం తగ్గిస్తున్నారు. చేనేత దారాలపై కూడా పన్నును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గిస్తున్నారు. వాటర్ హీటర్లు, వాటర్ కూలర్లు, సుగంధ ద్రవ్యాలు, పెయింట్స్, ఇస్త్రీ పెట్టెలు, గ్రైండర్లు, వాక్యూమ్ క్లీనర్లు మొదలైన వాటిపై కూడా ప్రభుత్వం జీఎస్టీని తగ్గిస్తున్నట్లు తెలిపింది.
దిగుమతి చేసుకొనే యూరియాపై కూడా జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. అలాగే 18 శాతం జీఎస్టీ ఉన్న ఈబుక్స్ పై కూడా పన్నును 5 శాతానికి తగ్గించడం జరిగింది. 2016లో 122వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా వస్తు, సేవల పన్నును అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జీఎస్టీ మండలి ఈ పన్నులను 5, 12, 18 మరియు 28 శాతాలుగా నిర్థారించింది. అయితే జీఎస్‌టీలోకి పెట్రోలియమ్ ఉత్పత్తులను తీసుకొనిరావాలా? వద్దా? అన్న అంశంపై ఇప్పటికే అనేక తర్జన భర్జనలు జరుగుతున్నాయి.