నేను హోంమంత్రినైతే.. మేధావులను కాల్చి చంపుతా: బీజేపీ నేత

కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : Jul 27, 2018, 06:19 PM IST
నేను హోంమంత్రినైతే.. మేధావులను కాల్చి చంపుతా: బీజేపీ నేత

కర్ణాటకలోని విజయపుర ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఓ పబ్లిక్ మీటింగ్‌కి వెళ్లిన ఆయన మాట్లాడుతూ, తాను గనుక హోం మంత్రినైతే భారతదేశంలోని పలువురు మేధావులను కాల్చి చంపుతానని అన్నారు. మేధావుల పేరుతో అనేకమంది ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తున్నారని.. అలాంటి వారి వల్లే దేశానికి అసలైన ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు.

ఈ దేశంలో ఉంటూ... ఈ దేశ తిండి తింటూ, ఈ దేశపు నీరు తాగుతూ, ఈ దేశ సంపదను అనుభవిస్తూ కూడా.. ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు పెరుగుతున్నారని ఆయన అన్నారు. మేధావుల పేరుతో ఈ దేశంలో చెలామణీ అయ్యేవారు దేశద్రోహులని.. వారిని చంపకపోతే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు యత్నాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాయి. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు యత్నాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి. 

ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం యత్నాల్‌కి కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆయన కార్పొరేటర్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. లోకల్ లీడర్స్ హిందువుల కోసమే పనిచేయాలని.. ముస్లిముల కోసం పనిచేయకూడదని తెలిపారు. పైగా తాను హిందువులను సపోర్టు చేస్తూ మాట్లాడడం అనేది తప్పు విషయం కాదు కదా..? అని విలేఖరులను సైతం ప్రశ్నించారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో బసనగౌడ కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు. 1999 నుండి 2009 వరకు ఆయన బీజాపూర్ ఎంపీగా కూడా కొనసాగారు. 2010లో జేడీఎస్ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే మళ్లీ బీజేపీ పంచన చేరారు. 

Trending News