ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భేటీ

మూడు రోజుల అధికారిక భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌లను కలుసుకున్నారు.

Last Updated : Feb 18, 2018, 04:28 PM IST
ప్రధాని నరేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భేటీ

మూడు రోజుల అధికారిక భారత పర్యటనకు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ లను కలుసుకున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి మోదీ, హసన్ రౌహానీల మధ్య ప్రతినిధి బృంద చర్చలు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరుగుతున్నాయి.

అంతకు ముందు ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత ప్రధాని, రాష్ట్రపతి సమక్షంలో రాష్టప్రతి భవన్‌లో గౌరవ వందనం స్వీకరించారు. ఆ తరువాత రాజ్ ఘాట్‌కు వెళ్లి బాపూ ఘాట్‌కు నివాళులు అర్పించారు.

 

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో కూడా ఆయన భేటీ అయ్యారు. 'ఇంధనం, ఐటీ, విద్య, సంస్కృతి లాంటి విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చర్చలు జరిగాయి' అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

 

వ్యూహాత్మక చబహర్ పోర్టు ప్రాజెక్టు మొదటిదశలో భారతదేశ కార్యకలాపాలను అనుమతించే ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఓడరేవు పాకిస్థానీ పోర్ట్ ఆఫ్ గ్వాదర్ నుండి 72 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పోర్టు ద్వారా పాకిస్తాన్ జోక్యం లేకుండా నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ వర్తక, వాణిజ్య సంబధాలను మెరుగు పరుచుకుంటుంది.  

భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేందుకు ఇండియన్ ప్రభుత్వం చబహర్ పోర్టు కోసం 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది. ఈ పోర్టు ద్వారా మధ్య ఆసియా దేశాలతో భారతదేశానికి వర్తకం చేసుకొనే వెసులుబాటు లభిస్తుంది.

ఈ సమావేశంలో ఇరు పక్షాల పరస్పర ఆసక్తి, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకునే అవకాశాలున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కార్పోరేషన్ పై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఫిబ్రవరి 15న ఇరాన్ అధ్యక్షుడు హైదరాబాదును సందర్శించారు. ఆయన సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ ఫోర్ట్ మరియు కుతుబ్ షాహి సమాధులను సందర్శించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ పాతబస్తీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతదేశంలో భిన్న మతాలవారు శాంతియుత సహజీవనం గడపాలని ఆకాంక్షించారు.

Trending News