పాట్నా: శనివారం రాత్రి పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్‌లో లాలూ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్- ఆర్జేడీ సీనియర్ నేత చంద్రిక రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్ వివాహ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఒకపక్క కుటుంబసభ్యులందరూ పెళ్లి వేడుకల్లో బిజీబిజీగా ఉంటే మరోపక్క కొందరు దుండగులు పెళ్లిలో తమ చేతివాటం ప్రదర్శించారు. చేతికి దొరికిందల్లా దోచుకొనిపోయారు. తినే ప్లేట్లు, పెళ్లి భోజనం, బహుమతులు, బాణాసంచా, టేబుళ్లు, కుర్చీలు, వంట పాత్రలు ఇలా ఏదిపడితే అది దొంగలించుకొని పోయారు. దీంతో పెళ్లిలో గందరగోళం నెలకొంది.
పెళ్లికి ఆహ్వానం అందని వాళ్లు కూడా.. పార్టీకి సంబంధించిన వాళ్లం అని చెప్పి సెక్యూరిటీని దాటి వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఈ క్రమంలో కొందరు ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలలో పెళ్లి భోజనం ఎత్తుకెళ్లారు. పార్టీ నేతలు భోజనం ఎత్తుకెళ్లేవాళ్ల వెంట పడినా ఫలితం లేకపోయింది. సుమారు 7 వేల మంది కోసం భోజన సదుపాయం ఏర్పాటు చేయగా.. ఊహించని రీతిలో జనాలు హాజరయ్యారు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఇది జరిగినట్లు ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు.
లాలూ కొడుకు పెళ్లికి హాజరైన నితీశ్
కూటమి నుంచి విడిపోయాక తొలిసారి బీహార్ సీఎం నితీశ్ కుమార్.. లాలూలు ఒకే వేదికపై కనిపించారు. ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తేజ్ ప్రతాప్-ఐశ్వర్యలను నితీశ్ కుమార్ ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు బీహార్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తదితరులు హాజరయ్యారు.