సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది.

Last Updated : Jan 12, 2018, 04:37 PM IST
సీఎం కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడి జరిగింది. శుక్రవారం బక్సర్ జిల్లాలోని నందన్‌లో సమీక్ష యాత్రకు హాజరయ్యేందుకు వెళ్లిన నితీష్ కుమార్‌ని దళితవాడలో పర్యటించాల్సిందిగా నందన్ వాసులు పట్టుపట్టారు. కానీ నితీష్ కుమార్ దళిత వాడలో పర్యటించకుండా వెళ్లడంతో ఆగ్రహం చెందిన స్థానికులు కొంతమంది అతడు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వి తమ నిరసన వ్యక్తంచేశారు. ఈ ఘటనలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి ఎటువంటి హానీ జరగకుండా అతడిని క్షేమంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందిలో ఇద్దరికి గాయాలయ్యాయి.

రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణ గురించి తెలుసుకుంటూ, ఆయా పథకాలని ప్రజలకి మరింత చేరువ చేసేందుకు గత డిసెంబర్ 12 నుంచి సమీక్ష యాత్ర పేరిట సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ సమీక్ష యాత్రలో భాగంగానే వారం రోజుల క్రితం సహర్స జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రికి అక్కడి యువత నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి రాకను వ్యతిరేకిస్తూ కొంతమంది యువత నల్ల జండాలతో నిరసన చేపట్టారు. అయితే, వారిపై చర్యలు తీసుకోవడానికి పూనుకున్న పోలీసులను నిరోధించిన నితీష్ కుమార్.. కేవలం నలుగురు, ఐదుగురు యువకులు చేసిన ఓ చిన్న నిరసన కాస్తా వారిపై చర్య తీసుకున్న కారణంగా పెద్దదిగా కనిపిస్తుందని, అందువల్ల వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులకు సూచించారు.

Trending News