పైపైకే ఎగబాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రో ధరలు మరోసారి పెరిగాయి.

Last Updated : Sep 8, 2018, 09:24 AM IST
పైపైకే ఎగబాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు

దేశంలో పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పెరిగిపోతుండడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ తగ్గడం, ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలను పెరిగేలా చేస్తున్నాయని.. ఫలితంగానే పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా గత ఆగస్టు నుంచి ప్రతి రోజూ రూపాయి మారకం విలువ పడిపోతుండడం.. దానికి తగ్గట్లుగానే చమురు ధరలు పెరుగుతూ వచ్చాయి.

ధరల సమీక్ష అనంతరం ఇవాళ లీటర్‌ పెట్రోలుపై 42 పైసలు, డీజిల్‌పై 48 పైసలు పెరిగాయి. ధరలు పెరిగిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోలు ధర రూ.80.38లు ఉండగా, డీజిల్‌ రూ.72.51లుగా ఉంది. ముంబైలో లీటర్‌ పెట్రోలు ధర రూ.87.77లు, డీజిల్‌ రూ.76.98లుగా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోలు ధర రూ.83.54లు ఉండగా, డీజిల్‌ రూ.76.64లుగా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.27గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ75.36 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధర రూ.85.23లు ఉండగా, డీజిల్‌ రూ.78.87లుగా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోలు ధర రూ.86.69, డీజిల్‌ రూ.79.99లుగా ఉంది.

పెట్రో ధరలు రికార్డు స్థాయి చేరడంతో దేశంలోని ప్రతిపక్షాలు నిరసన బాట పట్టాయి. వచ్చేవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి రెడీ అయ్యాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా.. సోమవారం రాజకీయ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి.

 

Trending News