చిదంబరం మాటలకు మోడీ ఘాటైన స్పందన

  

Last Updated : Oct 29, 2017, 05:37 PM IST
చిదంబరం మాటలకు మోడీ ఘాటైన స్పందన

ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్ విషయమై మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి చిదంబరం అన్న మాటలకు ఘాటుగా స్పందించారు. జమ్మూ-కశ్మీరుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న ఆయన మాటలకు కాంగ్రెస్ సిగ్గుపడాలి అని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత  చిదంబరం మాట్లాడిన మాటలు దేశ సైనికులను అవమానించే విధంగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో దశమ సౌందర్యలహరి ప్రయాణోత్సవ మహాసమర్పణే కార్యక్రమానికి విచ్చేసిన మోడీ జనులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఆజాద్ కాశ్మీర్ అంటూ నినాదాలు చేస్తున్న వారికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు తెలియజేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే వేర్పాటువాదుల మాటల్లా ఉన్నాయని.. అలాంటి మాటలు పాకిస్తాన్ మిలిటెంట్లు మాత్రమే మాట్లాడుతారని చెప్పారు. "ఇది సర్దార్ పటేల్ నడయాడిన నేల. ఆయన భావజాలానికి అనుగుణంగా సమైక్యతకే ఎప్పుడూ మనం కట్టుబడి ఉంటాం" అని మోడీ తెలియజేశారు.

"కాంగ్రెస్ మాటలు చూస్తుంటే వారికి సర్జికల్ స్ట్రైక్స్ పైనా, మన సైనికుల వీరత్వంపైనా ఎలాంటి అనుమానాలు ఉన్నాయో బాగానే అర్థమవుతుంది. జాతీయతకు వ్యతిరేకంగా వారు ప్రవర్తిస్తున్నారు. అసలు చెప్పాలంటే 1947 నుండీ కాంగ్రెస్ వ్యవహరిస్తోన్న తీరే కాశ్మీర్ సమస్యకు ముఖ్య కారణం. తాము చేసిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోవడం మానేసి, వ్యతిరేకంగా మాట్లడుతున్నారు" అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అయితే ఇదే విషయంపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా మాట్లాడుతూ, కాశ్మీరు ఎప్పటికీ భారత్‌లో భాగమేనని, ఎవరో సభ్యుడు అన్నమాటలు, కాంగ్రెస్ అభిప్రాయాల క్రిందకు రావని మీడియాకు తెలియజేశారు. 

 

Trending News