న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్ర నేత, భోపాల్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓటు హక్కును దిగ్విజయ్ సింగ్ వినియోగించుకోలేదని, అది మహా పాపమే అవుతుందని మోదీ విమర్శించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటివారే క్యూలో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెబుతూ దిగ్విజయ్ సింగ్ మాత్రం తన ఓటు హక్కును నిర్లక్ష్యం చేసి పెద్ద పాపమే చేశారని మోదీ ధ్వజమెత్తారు.
భోపాల్ లోక్ సభకు పోటీచేస్తోన్న దిగ్విజయ్ సింగ్‌కి రాజ్‌ఘడ్‌లో ఓటు హక్కు నమోదై ఉంది. ఇటీవల 6వ విడత లోక్ సభ పోలింగ్‌లో భాగంగా భోపాల్ లోక్ సభకు పోలింగ్ జరగగా.. ఆరోజు వివిధ పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని పర్యవేక్షించే పనిలో నిమగ్నమైన దిగ్విజయ్ సింగ్ అక్కడి నుంచి రాజ్‌ఘడ్‌కి సకాలంలో వెళ్లలేకపోయారు. దీంతో దిగ్విజయ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోయానని పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి భోపాల్‌లో ఓటు హక్కును నమోదు చేసుకుంటానని దిగ్విజయ్ సింగ్ పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిగ్విజయ్ సింగ్‌పై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.