సుప్రీం కోర్టు నుంచి మరో సంచలన తీర్పు.. కోర్టు విచారణలు ఇక లైవ్‌లో ప్రసారం

సుప్రీం కోర్టు నుంచి మరో సంచలన తీర్పు

Last Updated : Sep 26, 2018, 05:28 PM IST
సుప్రీం కోర్టు నుంచి మరో సంచలన తీర్పు.. కోర్టు విచారణలు ఇక లైవ్‌లో ప్రసారం

కోర్టులో జరిగే విచారణలను లైవ్‌లో ప్రసారం చేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ విజ్ఞప్తికి సమ్మతం వ్యక్తంచేసిన కోర్టు... ఆ నూతన ఒరవడిని సుప్రీం కోర్టు నుంచే మొదలుపెట్టనున్నట్టు స్పష్టంచేసింది. కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం జరగడం వల్ల కేసుల దర్యాప్తుల్లో పారదర్శకత వస్తుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ లైవ్ స్ట్రీమింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురావడానికి పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని కోర్టు తేల్చిచెప్పింది. అయితే, ఈ లైవ్ స్ట్రీమింగ్ విధానాన్ని అమలు చేయడానికన్నా ముందుగా ప్రజలు తమ హక్కు పొందుతూనే అదే సమయంలో కక్షిదారుల పరువు-ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండే విధంగా పలు నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని కోర్టు తెలిపింది. 

తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా మొట్టమొదటగా ఈ విధానాన్ని సుప్రీం కోర్టులోనే ప్రవేశపెట్టనున్నట్టు ఈ సందర్భంగా కోర్టు స్పష్టంచేసింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయిన తర్వాత ఆ ఫలితాలను అనుసరించి ఆ తర్వాత మిగతా కోర్టులలో ఈ లైవ్ స్ట్రీమింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, డీవై చంద్రచూద్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

Trending News