యోగి ఆదిత్యనాథ్‌కి "దళిత మిత్ర" పురస్కారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి లక్నో ప్రాంతానికి చెందిన అంబేద్కర్ మహాసభ "దళిత మిత్ర" పురస్కారంతో సత్కరించింది. 

Last Updated : Apr 14, 2018, 09:20 PM IST
యోగి ఆదిత్యనాథ్‌కి "దళిత మిత్ర" పురస్కారం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి లక్నో ప్రాంతానికి చెందిన అంబేద్కర్ మహాసభ "దళిత మిత్ర" పురస్కారంతో సత్కరించింది. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిత్యానాథ్ మాట్లాడుతూ "బీజేపీ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దళితుల ఔన్నత్యాన్ని పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నది అన్న మాట సత్యం. ఇప్పటికే యూపీలోని దళితుల ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో ఇదే ప్రభుత్వం 40 లక్షల వరకు టాయిలెట్లను నిర్మించింది" అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. "కులాల అసమానతలను తొలిగించడానికి బాబా సాహెబ్ అంబేద్కర్ అనేక అంశాలను తెరమీదికి తీసుకురావడమే కాకుండా.. కొత్త విధానాలు కూడా రూపకల్పన చేశారు. భారతదేశంలోని ప్రతీ పౌరుడు ఆయనను ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటాడు" అని తెలిపారు

బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల సంక్షేమం కోసం తన జీవితాన్నే త్యాగం చేశారని.. వారి హక్కుల కోసం అహర్నిశలు పోరాడారని ఈ సందర్భంగా యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. తన ప్రసంగాన్ని ముగించాక ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కట్టుదిట్టమైన భద్రత దళాల మధ్య యూపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం.

ఆదిత్యనాథ్, అంబేద్కర్ జయంతోత్సవాలలో పాల్గొనడానికి వస్తున్నారని తెలిసి పలు సంస్థలు హింసను ప్రేరేపించే అవకాశముందని తమకు సమాచారం అందిందని.. అందుకే అదనపు పోలీసు బలగాలను కూడ అప్రమత్తం చేశామని ఈ సందర్భంగా యూపీ పోలీసు అధికారులు తెలిపారు. 

Trending News