Comeback Players in IPL 2023: ఐపీఎల్ కేవలం కొత్త ఆటగాళ్లకు పేరు తీసుకురావడమే కాదు.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు సీనియర్ ప్లేయర్లకు కూడా ఓ మంచి వేదికగా మారింది. ప్రతి సీజన్లో కొంతమంది ప్లేయర్లు ఐపీఎల్లో రాణించి టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకున్నారు. గతేడాది దినేష్ కార్తీక్ ఐపీఎల్లో చెలరేగడంతో టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కింది. ఈ సీజన్లో కూడా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తమ ప్రదర్శనతో అబ్బురపరుస్తున్నారు. వాళ్లు ఎవరంటే..?
టీమిండియా జట్టులోకి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోతుంటాడు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ. ఐపీఎల్లో కూడా 2021లో ఆడాడు. ఈ సీజన్లో ఢిల్లీ జట్టును తరుఫున ఆడుతున్న ఇషాంత్ శర్మ.. ఢిల్లీకి కీలక బౌలర్‌గా మారాడు. కేకేఆర్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి.. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఐపీఎల్ ప్రారంభం ముందు వరకు అజింక్యా రహానేకు చెన్నై తుది జట్టులో చోటు కూడా అనుమానంగానే ఉండేది. అయితే అనూహ్యంగా జట్టులో స్థానం దక్కగా.. ఒక్కసారిగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం చెన్నైకు కీలక ప్లేయర్‌గా మారియాడు. రహానే ఐపీఎల్ ఫామ్‌తో టీమిండియా టెస్టు జట్టులోకి మళ్లీ పిలుపువచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రహానేను జట్టులోకి ఎంపిక చేశారు.
మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మోహిత్ శర్మ గురించి. ఒకప్పుడు కీ బౌలర్‌గా రాణించినా.. గతేడాది నెట్ బౌలర్‌గా సేవలందించినా.. ఎక్కడా తన నమ్మకం కోల్పోలేదు. ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరుఫున ఆడే అవకాశం దక్కించుకుని అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం 4.66 ఎకానమీ రేటుతో పరుగులు ఇస్తుండడంతో విశేషం.
ముంబై ఇండియన్స్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా వయసు ఇప్పటికే 34 ఏళ్లు. ఈ సీజన్లో ముంబైకి కీ బౌలర్‌గా మారాడు. 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లతో ముంబై తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.
గతేడాది జరిగిన మినీ వేలంలో సందీప్ శర్మను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ముందుకురాలేదు. రాజస్థాన్ జట్టు మొదట్లో నెట్ బౌలర్‌గా తీసుకుంది. అయితే ప్రసిద్ధ్ కృష్ణ గాయపడడంతో అనూహ్యంగా టీమ్‌లో స్థానం లభించింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధోనిని నిలువరించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఐదు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీశాడు.
వయసు పెరిగినా వన్నె తగ్గని బౌలర్ అమిత్ మిశ్రా. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్‌గా బౌలింగ్ చేసున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మిశ్రా.. 4 మ్యాచ్‌ల్లో 6.5 ఎకానమీ రేట్‌తో 4 వికెట్లు తీశాడు.