ఆర్ కే స్టూడియోస్.. లెజెండరీ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ కలల సౌధం. ఎన్నో హిట్ చిత్రాలు ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. అంతకు మించి ఎంతో చరిత్రను మూటగట్టుకున్న ప్రతిష్టాత్మక స్టూడియోస్ "ఆర్కే స్టూడియోస్". అయితే అనేక సంవత్సరాలుగా నష్టాలతో నడుస్తున్న ఈ స్టూడియోస్‌ను విక్రయిస్తేనే మంచిదని అనుకుంటున్నారు రాజ్ కపూర్ వారసులు. ఇటీవలే రాజ్ కపూర్ తనయుడు రిషి కపూర్ కూడా ఇదే విషయంపై స్పందించారు.
"చాలా పాతకాలం నాటి ఈ స్టూడియోని ఆధునికంగా తయారుచేయాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. పైగా ఈ మధ్యకాలంలోనే అగ్ని ప్రమాదం కూడా సంభవించడంతో చాలా నష్టాలను చవిచూశాం. పైగా చిన్న సినిమాలు, టీవీ సీరియల్స్ తీసే నిర్మాతలు ఈ స్టూడియోస్ పట్ల మక్కువ చూపించినా.. వారు ఉచిత పార్కింగ్ స్పేస్, ఏసీ సౌకర్యంతో పాటు డిస్కౌంట్ ఆఫర్లు కూడా అడుగుతుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి స్టూడియోని నడపడం తలకు మించిన భారం" అని తెలిపారు.
రాజ్ కపూర్ వారసులందరూ కలిసి ఇటీవలే ఒక నిర్ణయం తీసుకొని.. ఈ స్టూడియోస్‌ని స్వయంగా నడపడం కన్నా.. అమ్మేస్తేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారట. అయితే ఈ స్టూడియోస్‌ని అమ్మకుండా పరిరక్షించే బాధ్యతను రణ్‌బీర్ కపూర్ తీసుకొనే అవకాశం ఉందా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు కూడా రిషి కపూర్ సమాధానమిచ్చారు.
"రణ్ బీర్ వద్ద అంత డబ్బు ఉంటే.. మేం చెప్పే ఆఫర్ నచ్చితే తననే స్టూడియోస్ కొనుక్కోమనండి. నాకు అభ్యంతరం లేదు. కానీ అంత రిస్క్ తీసుకోవద్దనే చెబుతాను. ఇప్పుడే తన కెరీర్ గాడిలో పడుతుంది. "సంజూ" సినిమా విజయం సాధించాక.. మంచి సక్సెస్ ఫుల్ హీరోగా అతనికి మంచి పేరొచ్చింది. ఇలాంటప్పుడు వేరే విషయాల గురించి ఆలోచించడం మంచిది కాదనే చెబుతాను" అన్నారు రిషి కపూర్. తమకు కూడా స్టూడియోస్ అమ్మేయాలంటే చాలా బాధగానే ఉందని.. కానీ ప్రాక్టికల్‌గా ఆలోచించడం తనకు అలవాటని తెలిపారు రిషి కపూర్.
#Update Fire at RK Studio: Fire broke out at the sets of TV show 'Super Dancer'. There was no crew at the set, today being Saturday #Mumbai pic.twitter.com/eujSGG1DgE
— ANI (@ANI) September 16, 2017