పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా కొనసాగుతున్న భారత్‌ బంద్‌

ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.

Last Updated : Sep 10, 2018, 09:29 AM IST
పెట్రోల్‌ ధరల పెంపునకు నిరసనగా కొనసాగుతున్న భారత్‌ బంద్‌

ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ధరల సమీక్ష అనంతరం ఢిల్లీలో ఇవాళ పెట్రోల్ 22 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ రూ.80.73, డీజిల్  రూ .72.83గా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.88.12, డీజిల్  రూ .77.32గా ఉంది.

మరోవైపు పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ... కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు పిలుపునకు మొత్తం 21 పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఎక్సైజ్‌ సుంకం తగ్గించేందుకు కేంద్రం ముందుకు రాకపోవడం వల్లే ధరలు పెరిగిపోతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బంద్‌ కారణంగా కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

 

 

 

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో బంద్‌ నిర్వహిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని జిల్లాల్లో వామపక్ష నాయకులు ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. ఏపీల వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి. వామపక్షాలు, జనసేన ఆధ్వర్యంలో నాయకులు బస్టాండ్ల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో ఇవాళ్టి సెమిస్టర్‌ పరీక్షలు కూడా వాయిదా వేశారు.

 

 

తెలంగాణలో కూడా  ఇంధన ధరల పెంపును నిరసిస్తూ.. భువనగిరిలో, హైదరాబాద్ ముషీరాబాద్ బస్ డిపో వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, హన్మకొండలలో వామపక్షాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాల నేతలు బస్‌ డిపోల వద్ద నిరసన తెలుపుతూ బస్సులను అడ్డుకుంటున్నారు.

 

ఇక తమిళనాడు, బీహార్, ఢిల్లీ. మహారాష్ట్రలో బంద్ ప్రభావం తీవ్రంగా ఉండగా.. మిగిలిన రాష్ట్రాల్లో పాక్షికంగా బంద్ ప్రభావం కనిపిస్తోంది. బంద్ దృష్ట్యా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.

గుజరాత్‌లోని బరూచిలో నిరసనకారులు రోడ్లపై టైర్టు పడేసి తగులబెట్టారు. బస్సులను ఎక్కడికక్కడ ఆపేశారు. ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

 

ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకులతో కలిసి రాజ్ ఘాట్  నుంచి రామ్ లీలా మైదాన్ వరకు వెళ్లి ఇంధన ధరల పెంపుపై నిరసన తెలిపారు.

 

ఒడిశా సంబల్‌పూర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహిస్తున్నారు. కోల్‌కతాలో బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈశాన్య కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NEKRTC) కూడా  'భారత్ బంద్' కారణంగా నేడు బస్సు సేవలను ఆపేసాయి.

 

Trending News