సీసీ టీవీ ద్వారా ఓట్ల లెక్కింపుపై భారత ఎన్నికల సంఘం నిఘా

ఈ నెల 11న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి

Last Updated : Dec 8, 2018, 07:13 PM IST
సీసీ టీవీ ద్వారా ఓట్ల లెక్కింపుపై భారత ఎన్నికల సంఘం నిఘా

హైదరాబాద్ : ఈ నెల 7న పూర్తయిన ఎన్నికల ఫలితాలు ఈ నెల 11న వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ జిల్లాలో కౌంటింగ్‌ జరగనున్న 15 కేంద్రాలలో ఓట్ల లెక్కింపుకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్‌ తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లకు మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టంచేశారు. ప్రతీ లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉండనుండగా, కేంద్రంలోని రిటర్నింగ్ అధికారికి ప్రత్యేక టేబుల్‌ను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ప్రతీ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్ సూపర్‌ వైజర్‌, మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ ఏజెంట్ లెక్కింపు విధుల్లో ఉంటారు. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్‌ల లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీసీ టీవీ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారితోపాటు భారత ఎన్నికల సంఘం పర్యవేక్షించేందుకు అవకాశం ఉందని ఎన్నికల అధికారి దానకిషోర్‌ తెలిపారు.

ఓట్ల లెక్కింపులో పాల్గొననున్న సిబ్బందికి ఇప్పటికే తొలివిడత శిక్షణ పూర్తి కాగా 10వ తేదీన రెండవ విడత శిక్షణ ఉంటుందని దాన కిషోర్ చెప్పారు.  

Trending News