తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిర్వాసితుల పిటిషన్పై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టులో ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. లక్షల ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టును కేవలం రెండు మూడెకరాలు ఉన్న భూయజమానుల కోసం ఆపలేమని స్పష్టం చేసింది. పరిహారం తీసుకోవాలని నిర్వాసితులకు సూచించింది.
అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చు
ఇదే సమయంలో పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే నిర్వాసితులు కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. హైకోర్టు తాజా నిర్ణయంతో సహాయ పునరావస ప్యాకేజీ వంద శాతం పూర్తయినట్లయింది. తాజా తీర్పుతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకునే అవకాశం దొరికింది
హర్షం వ్యక్తం చేసిన టి.సర్కార్..
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 175 కేసులను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాలన్న ప్రభుత్వ పిటిషన్ను హైకోర్టు అంగీకరించింది. పిటిషన్లు అన్నీ కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం, ప్రాజెక్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.