యువ ఆవిష్కర్త అశోక్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్

యువ ఆవిష్కర్త అశోక్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్  

Last Updated : Nov 9, 2019, 09:26 PM IST
యువ ఆవిష్కర్త అశోక్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్: తక్కువ ఖర్చుతో పోర్టబుల్ వరి కలుపును తీసే చిన్న యంత్రాన్ని కనిపెట్టినందుకు యువ ఆవిష్కర్త అశోక్‌ను మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. వరి పొలాల నుండి పెద్ద కలుపు మొక్కలను సులభంగా తొలగించడానికి సహాయపడే యంత్రాన్ని ఆవిష్కరించిన అశోక్ ను అభినందించిన మంత్రి కేటీఆర్.. యువ ఆవిష్కర్త అశోక్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. యువతలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారిని ప్రోత్సహించడమే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం లక్ష్యం అని చెబుతూ.. అలాంటి సృజనాత్మకతను కనబరుస్తున్న అశోక్ కు అన్నివిధాల సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫనీంద్ర సామను ఆదేశించారు.ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫనీంద్ర సామ, యువ ఆవిష్కర్త అశోక్ శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దపల్లి జెడ్‌పి చైర్మన్ పుట్టా మధు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో యువ ఆవిష్కర్త అశోక్ ను ప్రశంసించిన మంత్రి కేటీఆర్.. వ్యవసాయ రంగానికి ఇలాంటి ఆవిష్కరణలు ఎంతో అవసరమని అన్నారు. 

సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్  ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019 (ఐఐఎస్ఎఫ్) స్టూడెంట్స్ ఇంజనీరింగ్ మోడల్ పోటీలో వ్యవసాయ రంగాల విభాగంలో అశోక్ కు మొదటి బహుమతి లభించడం విశేషం.అశోక్ కి ఆవిష్కరణలు ఇదేం తొలిసారి కాదు.. గతంలోనూ చెవిటివారికి ఉపయోగపడే విధంగా నిర్ణీత సమయంలో వాసనను విడుదల చేసే ఓ అలారం పరికరాన్ని కనుగొన్నారు. అలాగే చిన్న రైతుల కోసం ఒక బహుళార్ధసాధక హ్యాండ్‌టూల్ ను తయారు చేసిన అశోక్.. వ్యవసాయ రంగంలో ఆధునిక పరికరాలు, యంత్రాల ఆవిష్కరలపైనేనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్టు తెలిపారు.

Trending News