మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం

మేఘాలయ, నాగాలాండ్‌లలో 59 శాసనసభ స్థానాలకు మంగళవారం (ఫిబ్రవరి 27) పోలింగ్‌ ప్రారంభమైంది.

Last Updated : Feb 27, 2018, 11:27 AM IST
మేఘాలయ, నాగాలాండ్‌లలో పోలింగ్ ప్రారంభం

మేఘాలయ, నాగాలాండ్‌లలో 59 శాసనసభ స్థానాలకు మంగళవారం (ఫిబ్రవరి 27) పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాలలో 60 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. నాగాలాండ్‌లోని అంగ్మీ-2 నియోజకవర్గంలో నెఫ్యూరియో గెలుపు ఏకగ్రీవం కావడంతో, 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అలానే మేఘాలయలో విలియమ్‌ నగర్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దాడిలో ఎన్సీపీ అభ్యర్థి జోనాథన్‌ ఎన్‌ సంగ్మా చనిపోవడంతో అక్కడ ఎన్నిక ఆపేశారు. దీంతో అక్కడ కూడా 59 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 3న వెలువడనున్నాయి. కాగా, ఫిబ్రవరి 18న జరిగిన త్రిపుర ఎన్నికల ఫలితాలు కూడా అదేరోజు ప్రకటిస్తారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా, కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌ సింగ్‌లతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా, ఎంపి శశి థరూర్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

రెండు రాష్ట్రాలైన నాగాలాండ్‌, మేఘాలయలలో కాంగ్రెస్‌ 59 మంది అభ్యర్థులను ప్రకటించగా, బీజేపీ తరుపున 47మంది నామినేషన్‌లు దాఖలు చేశారు. మేఘాలయలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఎ. సంగ్మా కుమారుడు ఎ.సంగ్మా పార్టీ అయిన (నార్త్‌ ఈస్ట్‌ డెమక్రటిక్‌ అలయన్స్‌-ఎన్‌ఇడీఎ)తో, నాగాలాండ్‌లో ఎన్‌డిపీపీ పార్టీతో బీజేపీ పొత్తు కలిపింది. మేఘాలయలో 370 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 3,083 పోలింగ్‌ కేంద్రాలలో మొత్తం 18.4 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

 

మేఘాలయలో 32మంది మహిళా అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలువగా, నాగాలాండ్‌లో ఐదుగురు మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నాగాలాండ్‌లో 2,156 పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేకంగా 67 మహిళా పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి ఎఫ్‌ఆర్‌.ఖార్కొంగర్‌ తెలిపారు. 40 నియోజకవర్గాలలో ఎన్‌డిపీపీ (నేషనలిస్ట్‌ డెమొక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ పార్టీ) పోటీ చేస్తుండగా, బీజేపీ 20 స్థానాలలో పోటీ చేస్తుంది.

Trending News