Etela Rajender on CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. రాష్ట్రంలో 'కల్వకుంట్ల రాజ్యాంగం' కోరుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. వేల ఏళ్ల క్రితం నాటి రాచరిక పాలన రాష్ట్రంలో తీసుకురావాలని ఆయన భావిస్తున్నారని... అందుకే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని మండిపడ్డారు. దేశ ప్రజలందరికీ సమానత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ చెప్పేది కొండంత... చేసేది గోరంత అని ఎద్దేవా చేశారు.
ఈ దేశంలో ఒక ఛాయ్ వాలా ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని.. ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయ్యే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నో భాషలు, కులాలు, మతాలు, సంస్కృతుల కూడిన దేశంలో.. ప్రతీ ఒక్కరూ ఇది మన దేశమని భావించేలా చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ అని పేర్కొన్నారు. గుడిసెలో ఉన్నవారికైనా, బంగ్లాలో ఉన్నవారికైనా అంబేడ్కర్ సమాన ఓటు హక్కును కల్పించాడని... సమస్త సంపద సమస్త ప్రజానీకానికి చెందాలన్నాడని పేర్కొన్నారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల మద్దతు లేకపోయినా రాష్ట్ర ఏర్పాటు జరిగేలా రాజ్యాంగం అవకాశం కల్పించిందన్నారు. అందరికీ సమాన హక్కులు, సమానత్వాన్ని కల్పించిన రాజ్యాంగాన్ని తీసేయాలని కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. 'ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యాంగం ఇవన్నీ ఎందుకు... నా తర్వాత నా కొడుకు లేదా బిడ్డ.. లేదా అల్లుడు లేదా మనవడు సీఎం కావాలని కేసీఆర్ భావిస్తున్నాడు.' అని ఈటల విమర్శించారు.
రెండున్నర గంటల ప్రెస్ మీట్లో ఆయన భాష జుగుప్సాకరంగా, అసహ్యంగా ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లతో మీటింగ్ పెట్టి దేశ భవిష్యత్‌పై చర్చిస్తానని కేసీఆర్ చెబుతున్నారని... ఇదే తెలంగాణలో ఐఏఎస్ ఆకునూరి మురళి, ఐపీఎస్ ప్రవీణ్ లాంటి వారు ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేసిన సందర్భం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. అంబేడ్కర్‌ను అవమానిస్తే భారత జాతి క్షమించదన్నారు.
కాగా, నిన్నటి ప్రెస్ మీట్లో కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కేసీఆర్ (CM KCR)... రాజ్యాంగం గురించి ప్రస్తావిస్తూ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉందన్నారు. దీనిపై దేశంలో చర్చ జరగాలన్నారు. 50 ఏళ్ల ప్రజా జీవితంలో రాజ్యాంగం ద్వారానే ఎన్నో పదవులు పొందినప్పటికీ.. రాజ్యాంగంలో మార్పులు కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలతో బడ్జెట్‌పై (Union Budget 2022) చర్చ కాస్త రాజ్యాంగం మీదకు మళ్లింది. రాజ్యాంగంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Also Read: Revanth Reddy Strategy: కేసీఆర్, ఒవైసికి బీజేపి సుపారీ.. ఇదిగో నిదర్శనం: రేవంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook